మేడ్చల్, జూలై 6(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన సరే..ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా మాత్రం ప్రభుత్వ భూములు కేటాయించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనలో భాగంగా వివిధ ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు మాత్రం భూములను కేటాయించడంలో ప్రభుత్వం విస్మరిస్తున్నదన్న ఆరోపణలు ప్రజల నుంచి త్రీవంగా వినిపిస్తున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు అనేకం ఆక్రమణలకు గురువుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 11, 384 ఎకరాల అసైన్డ్ భూములు, 5,195 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వీటికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు అసెన్డ్, ప్రభుత్వ భూముల వివరాల సేకరణ అనంతరం ఈ భూముల వివరాలు గోప్యంగా ఉంచడంతోనే అనేక ఎకరాలు కబ్జాలకు గురైనట్లు అధికారులు తేల్చినట్లు సమాచారం.
సర్కారు భూముల రక్షణకు..
ప్రభుత్వ భూముల రక్షణకు ప్రజా ప్రయోజనాలకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వ భూముల కేటాయించాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు, సబ్స్టేషన్లు, కమ్యూనిటీ భవనాలు, కళాశాలలకు ఉపయోగించేలా చూడాలంటున్నారు. అయితే ఇలాంటి అభివృద్ధి పనులకు సంబంధించి అధికారం యంత్రాంగం ప్రభుత్వప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సర్కారు కూడా ఇలాంటి కార్యక్రమాలపై దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అనేకం ఆక్రమణలకు గురవుతున్నాయి. మల్కాజిగిరి నియోజవర్గంలోని 844 ప్రభుత్వ సర్వే నంబరులో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల మధ్య ఉన్న ప్రభుత్వ భూమి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన 55 ఎకరాలు ఆక్రమణలకు గురువుతున్నాయి. అల్వాల్‌లో 22, 23 సర్వే నంబర్లో 5 ఎకరాలు, మచ్చబోల్లారంలోని 91 సర్వే నంబర్ ఎకరం 10 గుంటలు, 223 సర్వేనంబర్లలో ఆక్రమణలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.
గాజులరామారంలో 307 సర్వే నంబర్లో 230 ఎకరాలు, 342 సర్వే నంబర్లో 45 ఎకరాల్లో ప్రతి నిత్యం ఆక్రమణలకు గురువుతూనే ఉన్నాయి. అల్వాల్‌లోని కాప్రా సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 199/1లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి ఇండ్లు నిర్మించి కబ్జాదారులు విక్రయిస్తున్నారు. మల్లాపూర్‌లోని సర్వే నంబర్ 24లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. పీర్జాదిగూడలో 3 ఎకరాల పార్క్ స్థలం కబ్జాకు గురికాగ బోడుప్పల్‌లోని 63/27 నుంచి 63/39 సర్వే నంబర్లలోని సుమారు 70ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పుడు 15 ఎకరాలే మిగిలిందన్న లెక్కలు చూయిస్తున్నారు. ఆక్రమణలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
24 గంటల్లో..
ప్రభుత్వ భూముల్లో జరిగే ఆక్రమణల్లో వేగంగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు అందజేసి.. ఇంటి నంబర్‌ను తెచ్చుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలకు పూర్తి సహకారం అధికారులు అందించడం వల్లే ప్రతి రోజూ వందలాది సంఖ్యలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.