సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొండలు, గుట్టలు, ఖాళీ జాగల కోసం ప్రభుత్వం ఒక కొత్త పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను కొన్ని ప్రాంతాలను వికేంద్రీకరించడం, విలీనం చేస్తూ కొత్తగా ప్యూచర్ సిటీ పేరుతో పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు అదనంగా మరో కమిషనరేట్‌ను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తున్నారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అయితే ఫ్యూచర్ సిటీ పేరుతో ఏర్పాటు చేయబోయే కొత్త కమిషనరేట్ పరిధిలో కొండలు, గుట్టలు, ఖాళీ జాగలే ఉండడంతో వీటి కోసం కొత్త పోలీస్ కమిషనరేటా? అని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలోకి ప్రభుత్వం విలీనం చేసి, 300 డివిజన్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్ని ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి.. దీంతో జీహెచ్ఎంసీని 12 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ విలీనం, విస్తరణ అన్ని ఇష్టానుసారంగా గజిబిజిగా జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మూడు పోలీస్ కమిషనరేట్లను కూడా విడగొట్టి కొత్త కమిషనరేట్, కొత్త జోన్లు, జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మల్కాజిగిరి, ఎల్బీనగర్, మహేశ్వరం, యదాద్రి భువనగిరి జోన్లు ఉన్నాయి. ఇందులో మహేశ్వరం, యదాద్రి జోన్లను రాచకొండ నుంచి విడగొట్టి, యదాద్రిని కొత్తగా జిల్లా ఎస్పీ స్థాయి, మహేశ్వరంను కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్యూచర్ సిటీ కమిషనరేట్లోకి కలపాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సైబరాబాద్‌లోని శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను హైదరాబాద్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్లో ఉన్న షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాలను ప్యూచర్ సిటీ కమిషనరేట్లోకి కలిపే విధంగా సన్నాహాలు చేస్తునట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోకి రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లను కలపాలని, రాచకొండలో ఉప్పల్ పేరుతో మరో జోన్ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.
కొత్త కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడంతో కొత్త కమిషనరేట్ ఎలా ఉండాలి? పాత కమిషనరేట్ల పరిధిలో ఏముండాలనే విషయాలపై పలు అభిప్రాయాలు పోలీసు అధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. అభిప్రాయాల మేరకు పోలీస్ కమిషనరేట్ల వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్‌ను విస్తరించి, హైదరాబాద్‌కు డీజీ స్థాయి అధికారికి కమిషనరేట్ ఇచ్చి హైదరాబాద్‌ను మొత్తం నాలుగు జోన్లు చేయాలని ఆలోచనలు కూడా జరిగాయి.
తెలంగాణ ఏర్పడిన తరువాత సైబరాబాద్ పరిధి ఎక్కువగా ఉండడంతో దానిలోని సగభాగాన్ని విడదీసి రాచకొండగా మార్చారు. ఈ రెండు కమిషనరేట్లలోకి ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ఉన్న ఐదు జోన్లను ఏడు జోన్లుగా వికేంద్రీకరణ చేశారు. తిరిగి ఇప్పుడు హైదరాబాద్‌లో గతంలో ఉన్న పాత జోన్ల సిస్టమ్‌ను కూడా తీసుకురావాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు సమాచారం. ఇలా భిన్న అభిప్రాయాలు ప్రభుత్వం వద్ద ఉండడంతో కొత్తగా ఏర్పాటయ్యే కమిషనరేట్, ప్రస్తుతం ఉన్న కమిషనరేట్లలో ఏఏ ప్రాంతాలుంటాయనేది ఆసక్తిగా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదనలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫార్మా సిటీని పక్కన బెట్టి ఫ్యూచర్ సిటీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్కడ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ ఉన్న ప్రాంతంలో చాలా వరకు గ్రామాలు, కొండలు, గుట్టలు ఉన్నాయి..? ఈ ప్రాంతంలో కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తారా? ఈ పేరుతో కొత్తగా కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి మహేశ్వరం జోన్లో కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తారా? అనే విషయాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పోలీస్ కమిషనరేట్ల పునర్వేవస్థీకరణ, కొత్త కమిషనరేట్ ఏర్పాటు, కమిషనరేట్ పేరు తదితర అంశాలన్నీ అభిప్రాయాల స్థాయిలోనే ఉన్నాయని, ఏదీ కూడా నిర్ధారణ కాలేదని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.