బంజారాహిల్స్, మే 14: చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖానా జలమండలి సెక్షన్ రిజర్వాయర్ పక్కనున్న ఖాళీ ప్రభుత్వ స్థలంలో నిత్యం కనిపించే దృశ్యాలివి.. ప్రధాన రోడ్డుమీద నుంచి వెళ్తున్న వారికి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు కనిపిస్తుంటే లోపల మాత్రం పటిష్టమైన నిఘా వ్యవస్థతో ప్రైవేటు వ్యక్తుల ఆజమాయిషీ కనిపిస్తూ అడుగడుగునా సందేహాలు రేకెత్తిస్తోంది.
నగరం నడిబొడ్డున రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్న వైనంపై ‘నమస్తే’ బుధవారం ‘కదలరు.. వదలరు’ శీర్షికతో ప్రచురించిన కథనంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కబ్జాదారులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించగా, దాని స్థానంలో అధికారులు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. వారంరోజులుగా ఇదే తంతు నడుస్తోందని. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రివేళ బోర్డును తొలగించడం పరిపాటిగా మారిందని స్థానికులు తెలిపారు.
షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నంబర్ 111, బ్లాక్- హెచ్, వార్డు-10లో ఎకరం స్థలాన్ని1998లో జలమండలికి కేటాయించగా తట్టిఖానా రిజర్వాయర్ నిర్మించారు. కాగా, 1999లో మరో 1.20 ఎకరాల స్థలాన్ని కూడా జలమండలి కోసం కేటాయించారు. ఈ రెండు స్థలాల మధ్య సుమారు 3.20 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంతో పాటు జలమండలికి చెందిన 1.20 ఎకరాల స్థలం చుట్టూ పదేండ్ల కిందట షేక్‌పేట మండల అధికారులు బ్లూషీట్స్తో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇటీవల జలమండలి రిజర్వాయర్ వైపున వాటర్‌వర్క్స్ నిధులతో ప్రహరీ నిర్మించారు.
కాగా స్థలం వెనకాల కమాండ్ కంట్రోల్ వైపు కొంతభాగంలో ప్రహరీ నిర్మించిన తర్వాత న్యాయస్థానంలో రాధికా కో ఆపరేటివ్ సొసైటీ కోర్టులో స్టే తీసుకురావడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంగా గత డిసెంబర్లో పి. పార్థసారథి అనే వ్యక్తికి చెందిన వ్యక్తులు ఈ స్థలంలోకి ప్రవేశించి కొన్నాళ్లు తిష్టవేయడం, ఈ స్థలం సర్వే నంబర్ 403/52/పీగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో నమస్తే తెలంగాణ పత్రికలో వరుస కథనాలు రావడంతో అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల మరోసారి ఈ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశిస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
రాత్రివేళలో స్థలంలో కూర్చుని మద్యం సేవించడం, వేటకుక్కలను ఏర్పాటు చేసుకుని ఎవరూ రాకుండా చూస్తున్నారు. స్థలం చుట్టూ ఉన్న ప్రహరీతో పాటు ఫెన్సింగ్‌కు బయటివైపు అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సోలార్ ప్యానెళ్లతో అనుసంధానం చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రైవేటు సైన్యం,బౌన్సర్లు దర్జాగా ప్రభుత్వ స్థలం వద్ద ఏర్పాటు చేసిన గేటునుంచి లోనికి రాకపోకలు సాగిస్తుండగా బయటి వ్యక్తులు రాకుండా తాళాలు వేసుకుంటుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఉండగా స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాట్లు, లోపలి భాగంలో రేకుల షెడ్లు, బాత్రూమ్స్ నిర్మించుకోవడం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఇన్ని కేసులు నమోదైనా దర్జాగా ప్రభుత్వ స్థలంలో తిష్టవేస్తూ స్థలం తమదే అంటూ ధీమా వ్యక్తం చేయడం వెనక ఎవరున్నారన్న అంశంపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 1.20 ఎకరాల జలమండలి స్థలంతో పాటు 3.20 ఎకరాల రెవెన్యూ స్థలం బయట ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను గతంలో తొలగిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయించాం. ఈ స్థలంలో సోమవారం రాత్రి బోర్డులను తొలగించినట్లు ఫిర్యాదులు రావడంతో మంగళవారం సాయంత్రానికి మరోసారి బోర్డులు ఏర్పాటు చేశాం. మా సిబ్బందిని పంపి ప్రతిరోజూ నిఘా పెట్టేలా చూస్తాం.
-అనితారెడ్డి, తహసీల్దార్,షేక్‌పేట మండలం