Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ నగర్ బస్తీని అనుకొని జేఎన్ఆర్ఎం ఇండ్లలో నివాసముంటున్న చాగంటి వెంకన్న, వెంగళ అరుణతో పాటు కొందరు బస్తీ నేతలు పక్కనే ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందుకున్న షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇతర సిబ్బంది రెండు రోజుల క్రితం కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల కోసం వెళ్లిన తహసీల్దార్‌తో పాటు ఇతర సిబ్బందిని అడ్డుకోవడంతోపాటు అవమానకరంగా మాట్లాడారు. కూల్చివేతలు జరగకుండా అడ్డుపడి సుమారు అరగంటసేపు న్యూసెన్స్ కు పాల్పడ్డారు. రెవెన్యూ సిబ్బంది వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాత్రి షేక్‌పేట్ తహసీల్దార్ వై అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకన్న, అరుణ తదితరుల మీద బీఎన్ఎస్ 329(3) 324(4), 79, 221,292 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.