బంజారాహిల్స్, జూన్ 26: నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనానికి షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. జింఖానా క్లబ్‌కు చెందిన భవన నిర్మాణ సామగ్రిని తొలగించడంతో పాటు లేబర్ కోసం వేసిన గుడిసెలను కూల్చివేశారు. షేక్‌పేట మండలంలోని సర్వే నంబర్ 403/పి, టీఎస్ నంబర్-1, హెచ్ బ్లాక్, 9వ వార్డులో సుమారు 3ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై న్యాయస్థానాల్లో వివాదాలు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ స్థలాన్ని అనుకుని ఉన్న ప్రైవేట్ స్థలంలో జింఖానా క్లబ్‌కు చెందిన భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ సామగ్రిని పక్కనున్న ఖాళీ ప్రభుత్వ స్థలంలో వేయడంతో పాటు సుమారు రూ.60 కోట్లు విలువచేసే 2వేల గజాల స్థలాన్ని చదునుచేసి తమ సొంతానికి వాడుకుంటున్నారు. నిర్మాణానికి సంబంధించిన కార్మికుల కోసం ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున గుడిసెలు వేశారు. ఈ వ్యవహారంపై ‘నమస్తే’ సమగ్రమైన కథనం ప్రచురించడంతో షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి స్పందించి.. ఆక్రమణలను కూల్చేయించడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. ఈ స్థలంలో భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలు వచ్చినా క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.