TGSPDCL | సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడి పనిచేసిన వారినే బదిలీ చేసేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. దాని ప్రకారం డిస్కంలోని మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందినే బదిలీ చేయాలని నిర్ణయించారు.
సుమారు 850 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఉన్న వారికి వెబ్ కౌన్సెలింగ్కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం డీఈ (డివిజినల్ ఇంజినీర్) స్థాయి నుంచి ఏడీఈ, ఏఈ నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే బదిలీలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సోమవారంతో గడువు ముగిసింది. రెండు, మూడు రోజులుగా సర్కిళ్ల వారీగా ఉన్నతాధికారులు బదిలీ ప్రక్రియను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం బదిలీల కోసం జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్లో ఫోకల్ పోస్టుల చుట్టూనే చర్చంతా జరుగుతున్నది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేసిన ఉన్నతాధికారులు, తరువాతి స్థాయి ఉద్యోగులైనా ఫోకల్ పోస్టుల్లో పనిచేసి ఉంటే.. వారికి బదిలీల సమయంలో వేరే నాన్ ఫోకల్ పోస్టులకు సంబంధించిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఎంతో కీలకమైన ఫోకల్ పోస్టును తాజా బదిలీల్లో సాధించే అవకాశం లేకుండా పోతోందని కొందరు మదనపడిపోతున్నారు.
మరికొందరు మాత్రం ఇది మంచి విధానమని, ఎలాంటి ఒత్తిళ్లు, పైరవీలకు అవకాశం లేకుండా కంప్యూటరైజేషన్ ద్వారా పారదర్శకంగా బదిలీ ప్రక్రియ జరుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్ల పరిధిలోనే పోస్టింగ్ కోసం చూసున్న వారికి ఈ వెబ్ కౌన్సెలింగ్ విధానం అవకాశం ఇవ్వడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో, ప్రాధ్యానత లేని పోస్టుల్లో పనిచేసిన వారికి ఇది మంచి అవకాశమని పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీలకు సచివాలయం కేంద్రంగా మారిందని, అక్కడి ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.