సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆందోళన బాట పట్టారు. ట్రేడ్ లైసెన్స్‌ల జారీ బాధ్యతలను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆందోళన చేపట్టారు.
కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి తమకు కేటాయించిన ట్రేడ్ లైసెన్స్, ప్రకటనల విభాగం పనులను రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు. దాదాపు 19 లక్షల ఆస్తుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తున్న తమకు ట్రేడ్ లైసెన్స్‌లు, ప్రకటన ఫీజులు వసూలు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని వాపోయారు. కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంతకు ముందు ట్రేడ్ లైసెన్స్‌లను మెడికల్ ఆఫీసర్లు జారీ చేసేవారు. ఈ బాధ్యతలను బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఇటీవల కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని మెడికల్ ఆఫీసర్లు, ప్రజారోగ్య నిపుణులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే తాజాగా బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవంగా జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 112(8) ప్రకారం ప్రమాదకరమైన వ్యాపారాలు లేదా పద్ధతులను నియంత్రించడం కార్పొరేషన్ తప్పనిసరి విధి. అలాగే బై లాస్ 1973లో బైలా 21 ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే మరుగుదొడ్లు, మూత్రశాలల సంఖ్యను హెల్త్ ఆఫీసర్లే నిర్ణయించాలి. ఈ అధికారాన్ని బిల్ కలెక్టర్లు, ఏఎంసీలకు అప్పగించడాన్ని చట్ట విరుద్ధమని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.