Hyderabad | సిటీబ్యూరో, మార్చి 15(నమస్తే తెలంగాణ): క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంది. అయినా ‘విద్యుత్ అంతరాయాలు ఎందుకు వస్తున్నాయి’ అనే అంశంపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రత్యేకంగా సమీక్షించి, విద్యుత్ సరఫరా వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ప్రధానంగా డిస్కం పరిధి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది.
ఇందులో పట్టణ ప్రాంతమైన జీహెచ్ఎంసీ పరిధిలోనే సింహ భాగం ఉంది. ఇందులో తొమ్మిది సర్కిళ్లు పట్టణ ప్రాంతంలోనే ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వాటిపై వస్తున్న ఫిర్యాదులను సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పలుమార్లు సమీక్షించారు. ఇందులో మెట్రో జోన్‌లోని హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో విద్యుత్ సరఫరా, విద్యుత్ అంతరాయాల విషయంలో సెక్షన్ ఏఈతో పాటు ఫ్యూజ్ ఆఫ్ కాల్ బృందాలు కలిసి పనిచేయాలని ఆదేశించారు.
నగరంలో విద్యుత్ అంతరాయాలు తలెత్తితే 1912కు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానికంగా ఉండే ప్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసీ)కు వినియోగదారులు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ ఫిర్యాదులపై సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ) విభాగానికి సమాచారమిస్తుంటారు. సీబీడీ బృందాలు మూడు షిప్టుల్లో పనిచేస్తుంటాయి. అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఎఫ్‌వోసీకి కాకుండా ఆపరేషన్ ఏఈకి ఫోన్ చేస్తే సీబీడీకి కాల్ చేయమంటారు. అది తమ పని కాదన్నట్లుగా ప్రవర్తిస్తుంటారనే ఫిర్యాదులు ఉన్నట్లు సీఎండీ గుర్తించారు.
ఇలాంటి సమస్యలు సర్కిల్, డివిజన్ తర్వాత ఉండే సెక్షన్ పరిధిలో తరచూ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. సీబీడీలు లేని శివారు ప్రాంతాల్లో ఎఫ్వోసీలకు ఆపరేషన్ ఏఈలు బాధ్యులుగా ఉన్నట్లే సీబీడీలు ఉన్న చోట సైతం బాధ్యత తీసుకోవాలని సీఎండీ సెక్షన్ అధికారులను ఆదేశించారు. ఆ బాధ్యతలు తీసుకోమని చెప్పేవారు తప్పుకుంటే కొత్తగా వారికి బాధ్యతలు అప్పగిస్తామని సీఎండీ హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ అంతరాయాలపై సంస్థకు చెందిన ఫోన్ నంబర్లకు ఫోన్ వచ్చినా స్పందించేందుకు కాల్ సెంటర్ ఉండగా, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు.