సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది. కానీ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వినియోగం పెరిగి 20 కిలోవాట్లు దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు నోటీసు జారీ చేశారు. ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటూ సూచించారు.
కానీ ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తుంది. దీంతో యజమానులు తలపట్టుకుంటున్నారు. అయితే రెండు నెలల కిందటే నోటీసులు జారీ చేసినా.. తాజాగా కరెంట్ ట్రిప్ అయితే కష్టమంటూ సిబ్బంది వచ్చి చెప్పడంతో సతమతమవుతున్నారు. మీటర్లు అప్‌గ్రేడ్ చేయాలని అడుగుతున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మరే పెట్టుకోవాలని లేకుంటే సైప్లెలో ప్రాబ్లమ్ వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారని ఫ్లాట్ల యజమానులు చెప్పారు. బిల్డర్‌తో విద్యుత్ సిబ్బంది కుమ్మక్కై మీటర్లు ఏర్పాటు చేయడం వల్లే ఇప్పుడు సమస్య వచ్చిందంటూ ఆగ్రహిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్ల పరిధిలో సుమారు 1.85 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వాటిపై చాలా చోట్ల ఓవర్‌లోడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో కరెంట్ సరఫరాలో సాంకేతిక సమస్యల వల్ల అంతరాయం కలగకుండా దక్షిణ డిస్కం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ప్రతి ఎలక్ట్రిక్ పోల్, ట్రాన్స్ఫార్మర్ను జీపీఎస్‌తో అనుసంధానం చేసి వాటిపై ఎంతలోడ్ ఉందనే వివరాలను ఎంటర్ చేశారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో మొదట గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంత మేర కరెంట్ లోడ్ ఉందనే వివరాలను సిబ్బంది పక్కాగా తీసుకున్నారు. సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ట్రిప్ అయి కరెంట్ సరఫరా నిలిచిపోతుండటంతో అధిక లోడ్ ఎక్కడ పడుతుంది..? ట్రిప్ కావడానికి కారణాలేంటనే అంశాలపై లోతుగా పరిశీలిస్తున్నారు.
దీంతో ప్రతీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి.. వాటి లోడ్ తదితర వివరాలను నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపుగా పదివేల అపార్ట్మెంట్లు, భవనాల్లో కరెంట్లోడ్ 20 కిలోవాట్లకు మించి ఉన్నా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోనట్లు గుర్తించారు. దీనిపై చర్యలు చేపట్టిన డిస్కం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. అపార్ట్మెంట్లలో సొంతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటే సుమారుగా 3నుంచి 4 లక్షల రూపాయల ఖర్చవుతుంది. ఒక ఇంట్లో నాలుగైదు పోర్షన్లున్నా.. లేదా ఒక అపార్ట్మెంట్లో 20 కిలోవాట్ల కంటే లోడ్ ఎక్కువగా ఉన్నా..కచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలి.
గ్రేటర్లో అధికారుల అంచనా ప్రకారం 20 కిలోవాట్లపైన లోడ్ పడుతున్న పదివేల భవనాలు, అపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలంటే సుమారుగా రూ. 300 కోట్లు ఖర్చవుతుంది. ఈ విషయంలో రెండు నెలల కిందట వరకు నోటీసులు జారీ చేయగా.. మధ్యలో యజమానుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా టీజీఎస్పీడీసీఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. మరోవైపు కొన్ని సర్కిళ్ల పరిధిలో పలుచోట్ల వినియోగదారులు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగి కరెంట్ ట్రిప్ కావడం లేదా కాలిపోవడం జరుగుతున్నదని సిబ్బంది చెబుతున్నారు.
లోడ్ ఎక్కువగా ఉన్నచోట ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విద్యుత్ సిబ్బంది చాలాచోట్ల వినియోగదారులను సంప్రదించి వారితో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై మాట్లాడుతూనే కొంతమేరకు ఒత్తిడి పెంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ లోడ్ పెరిగితే తామేం చేయలేమని, కరెంట్ సరఫరా నిలిచిపోతే తమ బాధ్యత కాదంటున్నారని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.
గ్రేటర్లో విద్యుత్ కనెక్షన్లు గణనీయంగా పెరిగాయి. గతేడాది సుమారు 2 లక్షల మేర కొత్త కనెక్షన్లు ఇచ్చినట్లు టీజీఎస్పీడీసీఎల్ చెబుతున్నది. ఇప్పటికే వినియోగంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి వెళ్లే ఎల్టీ లైన్ల నుంచే కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. దీంతో అక్కడున్న ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖే లోడ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ విషయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వినియోగదారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్తగా నిర్మాణాలు చేస్తున్న చోట ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటును తప్పనిసరిగా చేస్తూనే పాత అపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటునూ తప్పనిసరి చేసే ఆలోచనలో ఎస్పీడీసీఎల్ ఉంది. రాబోయే రోజుల్లో పెరిగే డిమాండ్, అధిక లోడ్ కారణంగా సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడవద్దంటే వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ అధికారులు కోరుతున్నారు. తమ వద్ద ఉన్న డేటా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అధికలోడ్ ఉన్నట్లు గుర్తించామని, వారికి గతంలోనే నోటీసులు ఇచ్చామని, ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.