రవీంద్రభారతి, ఏప్రిల్ 24: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేకపోతే యుద్ధం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు(ఎంపీ)ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించడం చాలా దారుణమని, బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు బీసీలను బలి చేసిందన్నారు.
త్వరలో వెయ్యి మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని ఆయన వెల్లడించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 12 నెలల కిందట జరపాల్సిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల గురించి వాయిదా పడుతూ జాప్యం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాకముందే మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఒక వేళ రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందన్నారు. ఏ మంత్రిని, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను 20శాతం నుంచి 42 శాతం అసెంబ్లీలో చట్టం చేసి, ఇంతవరకు ప్రభుత్వం జీవో ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని 73, 74 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డి-6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అధికారం ఉందన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపునకు కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు జి.అంజి, మణికంఠ, రాజునేత, నరసింహాగౌడ్, రవికుమార్, ఎస్.లక్ష్మీనారాయణ, ఫణి పాల్గొన్నారు.