కాచిగూడ, అక్టోబర్ 18: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, నాయ కులు, ప్రజలు, వాహనదారులు నిబంధనలు పాటించాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం బర్కత్పుర చమాన్లో తనిఖీలు చేపట్టారు. కాచిగూడ, బర్కత్పుర రోడ్డుపై అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పోలీసులు అపి తనిఖీలు చేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో లావాదేవీల వివరాలు లేకుండా అధిక మొత్తంలో నగదును తరలిస్తే సీజ్ చేస్తామని సూచించారు. వ్యక్తిగతంగా రూ. 50 వేలకు మించి వాహనాల్లో తీసుకెళ్లినా స్వాధీనం చేసుకుంటా మని పేర్కొన్నారు. లావాదేవీల వివరాలను సంబంధిత అధికారులకు అందించి వాటిని పొందే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట కాచిగూడ పోలీస్స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాచిగూడ పోలీస్స్టేషన్లో బుధవారం ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రౌడీషీటర్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఎస్ పరిధిలో ఉన్న రౌడిషీటర్లు చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై హెచ్.నరేశ్ పాల్గొన్నారు.