Crime News | సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఛేదించడంలో రాచకొండ పోలీసులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ కేసులు మిస్టరీగా మారుతున్నాయి. దర్యాప్తు నైపుణ్యాలను పోలీసులు మర్చిపోయారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. టెక్నాలజీ సపోర్టుతో ఈజీగా కేసులను ఛేదిస్తున్న పోలీసులకు సీసీ కెమెరాలు, సెల్ఫోన్ సిగ్నల్స్ దొరకలేదనే సాకుతో కొన్ని కేసులను పక్కన పెట్టేస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ హత్యల మిస్టరీని ఛేదించడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి తరువాత వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల వెనుక కారణాలేమిటీ? హంతకులెవరూ..? అనే విషయంలో పోలీసులు రెండు రోజులువుతున్నా చిన్న ఆధారాన్నీ సేకరించలేకపోయారు. వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని తరచూ హత్యలు జరుగుతున్నా, అందుకు గల కారణాలను మాత్రం పోలీసులు గుర్తించలేకపోతున్నారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పెట్రోలింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ యంత్రాంగం నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో పోలీసులు పని పక్కన పడేసి, సివిల్ వివాదాల పరిష్కారంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తూ అసలు కేసులపై దృష్టి సారించలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మిస్టరీ కేసుల సంఖ్య పెరుగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.