కందుకూరు, అక్టోబర్ 16: హైదరాబాద్ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు దోపిడీ దొంగలా..? ఇంటి దొంగలా..? సైకో పనా..? పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కందుకూరు మండల పరిధి, కొత్తగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఊశయ్య (70), భార్య శాంతమ్మ (65) దంపతులు. అదే గ్రామానికి చెందిన మనోహర్ రావుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రానికి కాపాలాగా ఉంటున్నారు.
ఈ వ్యవసాయ క్షేత్రం కందుకూరు మండలం పరిధిలోని కొత్తగూడ గ్రామంలో ఉన్నది. అక్కడున్న మామిడి తోటలోనే ఈ దంపతులు నివాసముంటున్నారు. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. మంగళవారం రాత్రి దుండగులు శాంతమ్మను రూమ్‌లో హత్య చేసి, మామిడి తోటలోకి తీసికెళ్లి ఊశయ్యను హతమార్చారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి యజమాని ఆ వృద్ధ దంపతులకు ఫోన్ చేయగా.. మాట్లాడకపోవడంతో నిద్రిస్తున్నట్టు భావించాడు. బుధవారం తెల్లవారుజామున యజమాని స్థానికంగా తెలిసిన వాళ్లతో విషయం చెప్పి.. వ్యవసాయ క్షేత్రం వరకు వెళ్లిరమ్మని కోరాడు.
సదరు వ్యక్తి అక్కడికి వెళ్లి చూడగా.. వృద్ధులు శవమై రక్తపు మడుగులో కనిపించారు. ఈ సమాచారాన్ని మనోహర్ రావుకు తెలపడంతో.. ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించారు. ఘటనా స్థలానికి ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి చేరుకొని.. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆధారాల కోసం పోలీసులు భిన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఒకపక్క మామిడి తోట.. మరోపక్క వరి చేను, మధ్యలో నీళ్లు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి డాగ్ స్కాడ్‌కు కూడా ఆధారాలు లభించలేదు. నిందితులు నీళ్లలో నుంచి పరారయ్యారా.? అనే అనుమానాలున్నాయి. ఈ వృద్ధులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా మద్యం మత్తులో అక్కడికి వెళ్లి వృద్ధులతో గొడవకు దిగారా.? దుండగులు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు యత్నిస్తే వృద్ధులు అడ్డుకున్నారా.? దుండగులతో వృద్ధులు పెనుగులాడిన ఆనవాళ్లున్నాయి.
వృద్ధురాలి గాజులు పగిలిపోయి ఉండటంతో పెనుగులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఒంటరిగా ఉండే వృద్ధులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటికీ పోలీసులు కొన్ని కేసులను ఛేదించలేకపోయారు. శివారుల్లో సైకో తిరుగుతూ.. ఒంటరి వృద్ధులపై దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ దారుణాన్ని కూడా సైకో చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు చిన్నపాటి ఆధారం కూడా వదలకుండా అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాలతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.