హైదరాబాద్: పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోఖుల్నగర్లో శ్రీకృష్ణుని రథోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రామంతాపూర్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు.. ధోని (21), వికాస్ (20) మరణించారు. చంద్రాయణగుట్ట నుంచి పురానాపుల్కు 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో విగ్రహానికి కరెంటు వైరు తగలడంతో దానిని కర్రతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు మరణించారు. వీరితో వెంట ఉన్న మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఒవైసీ దవాఖానకు తరలించారు.
ఇక అంబర్పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంట్ తీగలను కట్టెతో పైకి లేపుతుండగా.. షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కందపడి పోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వరుసగా రెండు రోజుల్లో మూడు విద్యుత్ షాక్ ఘటనలు సంభవించడం, 8 మంది మరణించడం పట్ల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ల వద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.