మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షంలో పంటలకు తీవ్రనష్టం జరిగింది. బుధవారం రాత్రి మెదక్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్త్తరు వర్షం పడింది. మొక్కజొన్న, వరి,కూరగాయ పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేగోడ్‌లో 27.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దశంకరంపేటలో 20.3 మి.మీటర్లు, నర్సాపూర్‌లో 17.5 మి.మీటర్లు వర్షపాతం నమోదుకాగా మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. కూరగాయ పంటలు పూర్తిగా నేలమట్టంకాగా, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం జరిగింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.
మోస్తరు వర్షం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు రావడంతో హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెల్లవారు జామున సుమారు 3గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉరుములతో కూడిన వాన కురిసింది. రాత్రి 3.15 నుంచి 3.30మధ్య పిడుగుపాటుకు హుస్నాబాద్‌లోని 20వ వార్డులో నారోజు తిరుపతి అనే వ్యక్తి ఇంటి ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుకు నిప్పంటుకొని దగ్ధమైంది. భారీ శబ్దంతో పిడుగు పడటం వల్ల చుట్టుపక్కల ఇండ్లవారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు కొబ్బరి చెట్టుపై లేచిన మంటలను ఆర్పివేశారు. పిడుగుపాటుకు ఇదే వార్డులోని సుమారు పది ఇండ్లల్లో ఫ్యాన్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. పలుచోట్ల అకాల వర్షం వల్ల వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.