మాగనూర్, మార్చి 18 : యాసంగి పంటలు సాగు చేసిన రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో పారుతున్న కృష్ణానది నీళ్లులేక వెలవెలబోతూ రాళ్లు తేలింది. దీంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. నది నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసిన కొల్పూరు, మందిపల్లి, గజరందొడ్డి, పుంజనూర్, అడవి సత్యారం రైతులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం కొల్పూరు సమీపంలోని ముడుమాల్ లిఫ్ట్-ఏ వద్ద నదిలోకి చేరుకొని నిరసన తెలిపారు. పది రోజులుగా నదిలో నీటిమట్టం తగ్గడంతో 5 వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం నెలకొన్నదని ఆవేదన చెందారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉన్నదని, వారం రోజులు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఇందుకోసం కర్ణాటకలోని రాయిచూర్ ఎమ్మెల్యే దద్దల్ బసన్నగౌడ్తోపాటు మంత్రి శ్రీహరిని రైతులు కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.