Hyderabad | భాగ్యనగర ప్రగతి పతాక.. అభివృద్ధి పథాన రెపరెపలాడుతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం వరకు కొనసాగిన ఇబ్బడి ముబ్బడి పరిస్థితులకు.. అస్తవ్యస్త ప్రమాణాలకు చరమగీతం పాడి.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా విజయపథాన పరుగులు పెట్టిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. భావితరాలకు అందమైన, స్వచ్ఛమైన ఆధునిక నగరాన్ని అందించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా సిటీలో అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫ్లెఓవర్లు.. అండర్‌పాస్‌లు..చక్కటి రహదారులు.. దూరాన్ని దగ్గర చేసే లింకు రోడ్లు.. అందమైన చెరువులు.. సామాన్యుడు గర్వపడేలా ఫంక్షన్ హాళ్లు.. పేదల కడుపునింపే అన్నపూర్ణ క్యాంటీన్లు.. బస్తీ దవాఖానలు.. సమృద్ధిగా తాగునీళ్లు.. నిరంతరం విద్యుత్ వెలుగులు.. ఇలా అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలతో ఎనిమిదిన్నరేండ్లలో అద్భుత భాగ్యనగరం ఆవిష్కృతమైంది. ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసుకున్నది. అభివృద్ధికి చుక్కానిలా నిలుస్తూ.. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. పరిశ్రమలకు స్వర్గధామంగా మారి.. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ట్రాఫిక్ సమస్యకు ఎస్ఆర్డీపీ పరిష్కారం చూపుతుంటే.. ముంపు ముప్పునకు ఎస్ఎన్డీపీ ముకుతాడు వేస్తున్నది. తెలంగాణ సర్కారు దృఢమైన సంకల్పం..కార్యాచరణతో ఐటీలో మేటిగా నిలుస్తున్న భాగ్యనగర కీర్‌త్తి ఎల్లలు దాటింది.

సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో 5వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ప్రఖ్యాతి పొందింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ, 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి విస్తరించి ఉంది. కోటి జనాభాకు పైగా సేవలు అందిస్తున్నది. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే జీహెచ్ఎంసీ అగ్రగామిగా నిలిచింది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి వ్యూహకర్తగా వ్యవహరించడమే కాకుం డా ఆయన మార్గదర్శకత్వంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కార్యాచరణ, కార్పొరేటర్ల సలహాలు, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ పనుల వేగవంతానికి విశేష కృషి చేస్తున్నారు. గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో జీహెచ్ఎంసీ గణనీయమైన ప్రగతిని సాధించింది.

Mainds Space Chourasta
సర్వమతాల సమ్మేళనం.. పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటి, అమీర్ నుంచి గరీబ్ వరకు అందరినీ అక్కున చేర్చుకొని ఆదరించే ప్రేమగల్ల భాగ్యనగరం.. విశ్వనగరంగా రూపుద్దికుంటూ ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేసుకుంటూ విజయపథాన దూసుకెళ్తున్నది. ఇదంతా ఒక్కరోజులో ఒక్కరాత్రిలో జరిగిన అభివృద్ధి కాదు. నిరంతర శ్రమ, నిర్విరామ కృషి సుస్థిరమైన ప్రభుత్వం, దార్శనికత గల నాయకత్వం, ఆధునికతకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే ఓర్పు, నేర్పు గల యువ నాయకత్వ పటిమ, పారదర్శకతతో కూడిన సులువైన పారిశ్రామిక విధానం, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వెరసి అభివృద్ధి పథంలో రాకెట్ వేగంతో దూసుకుపోతూ విశ్వవిపణిలో విజయపతాకను ఎగుర వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై కథనం.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐటీ కారిడార్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలు రెండింతలు పెరిగితే.. ఎగుమతులు మూడింతలు పెరిగాయి. నాడు (2014కు ముందు) పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలుంటే.. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలతో నేడు వందల సంఖ్యలో
కొత్తగా పరిశ్రమలొచ్చి..హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా మార్చాయి.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా లింకు రోడ్ల నిర్మాణం చేపట్టింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరం, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. రూ.2,140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. తొలి విడతలో రూ.275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువశాతం వెస్ట్‌జోన్‌లోనే ఉండగా.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ క్రమంలోనే కోర్ సిటీలోనూ లింకు రోడ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఫ్లై ఓవర్‌కు పెట్టే ఖర్చులో నాలుగు లింకు రోడ్లు.. అందులోనూ తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుగుతుండటంతో ఈ దిశగా అడుగులు వేశారు. రూ.207.26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా.. 70 శాతం పూర్తయ్యాయి. తాజాగా ఫేజ్-3లో 50 రోడ్లను 120.92 కి.మీ. మేర నిర్మించేందుకు సుమారు రూ.1,500 కోట్లతో పనులు చేపట్టారు. శివారు మున్సిపాలిటీల్లో పనులు పట్టాలెక్కగా..మిగిలిన చోట టెండర్ దశలో ఉన్నాయి. వచ్చే 50 ఏళ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా రోడ్ నెట్ వర్క్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో 5 రూపాయలకే భోజనం అందించే అన్నపూర్ణ పథకం ద్వారా ఇప్పటికి 10.50 కోట్ల మందికి పైగా భోజనం అందించారు. 2014 మార్చి 1న 8 కేంద్రాలతో ప్రారంభమై.. ఇప్పుడు 150కి చేరింది. ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో 45 వేల మంది అన్నపూర్ణ భోజనాలు చేస్తున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన ప్రాంతం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఐటీ కారిడార్‌లో మౌలిక వసతులకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాలను కలిపే మైండ్ స్పేస్ జంక్షన్లో ఫ్లై ఓవర్‌తో పాటు అండర్‌పాస్‌ను నిర్మించింది. మరింత రద్దీ పెరగడంతో ఈ ప్రాంతం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదకు నేరుగా వెళ్లేందుకు మైండ్ స్పేస్ జంక్షన్లో ఉన్న ఐకియా స్టోర్ వెనక నుంచి మరో ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. అక్కడి నుంచి దుర్గం చెరువు మీదుగా కోర్ సిటీకి వెళ్లేందుకు కేబుల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. ఇలా మైండ్ స్పేస్ జంక్షన్ కేంద్రంగా 360 డిగ్రీల కోణంలో ఎటు చూసినా ఐటీ కంపెనీల భవనాలే కంటికి కనిపిస్తాయి. కాగా, 2014 నాటికి ఐటీ ఉద్యోగాలు 3,71,774 ఉంటే 2023 నాటికి 7,78,121 మందికి ఐటీ ఉద్యోగాలు దక్కాయి. ఇంకా కొత్తగా కంపెనీలు ఏర్పాటవుతుండగా, ఉద్యోగావకాశాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా 8 ఏళ్లలోనే రాష్ట్రంలో ఐటీ ముఖ చిత్రం మారిపోయింది.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) నగర ట్రాఫిక్ వ్యవస్థ రూపురేఖలను మార్చేసింది. నాలుగు ఫ్లై ఓవర్లు కట్టి నగరాన్ని ప్రపంచపటంలో పెట్టామని డబ్బాలు కొట్టుకున్న సమైక్య పాలకులకు భిన్నంగా మౌలిక వసతుల కల్పనలో మొక్కవోని దీక్షతో పరుగులు పెట్టించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నది. ఇందులో భాగంగానే సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో 18 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను పూర్తి చేశారు. వీటి వల్ల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరువు, అబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. మిగిలిన 14 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న 11 ప్రాజెక్టుల్లో ఒకటి మినహా ఈ ఏడాదిలో మిగతా 10 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
పాదచారుల భద్రత, ప్రమాదాల నివారణ కోసం ఈ ఏడాది రూ.28.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి పలు కాలనీ వాసులకే కాకుండా పాదచారులు, సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. మదీనాగూడ, మియాపూర్, పంజాగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, నేరెడ్మెట్ బస్టాండ్, ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
భవన నిర్మాణాల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తీసుకువచ్చేందుకు నగరం నలువైపులా 4 చోట్ల కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సారథ్యంలో ‘రీ సైస్టెనబులిటీ సంస్థ (రాంకీ) ఆధునిక వెబ్ టెక్నాలజీతో 2020 నవంబర్‌లో జీడిమెట్ల, 2021 జూన్‌లో ఫతుల్లాగూడ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా రోజుకు 500 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ జోన్ వైపు శామీర్‌పేట మండలం తూంకుంట, చార్మినార్ జోన్ వైపు శంషాబాద్ మండలం సాతంరాయి కుంట గ్రామంలో ఒక్కొక్కటి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వ్యర్థాల రీసైక్లింగ్ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 2000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 263 దవాఖానలు అందుబాటులోకి తీసుకురాగా.. మరో 37 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చెత్తతో సంపద సృష్టించాలన్న ప్రభుత్వ సంకల్పంతో జీహెచ్ఎంసీ విడతల వారీగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పుతున్నది. జవహర్ నగర్లో 19.5 మెగావాట్లతో ఏర్పాటైన విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని ఇటీవలే 24 మెగావాట్లకు పెంచారు. ఇక్కడే మరో 24 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 6.35 లక్షల వ్యర్థాలను (ఆర్డీఎఫ్) వినియోగించుకొని 225 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. నగరం నలువైపులా ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా దుండిగల్‌లో 14.5 మెగావాట్ల ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే మే నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా.. బీబీనగర్‌లో 11 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా మొత్తం 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల కంటే సకల సౌకర్యాలు కల్పించి పేదల హృదయాల్లో ఆనందం నింపడం కోసం సకల హంగులతో పలు ప్రాంతాల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్‌కు శ్రీకారం చుట్టింది. రూ.95.70 కోట్ల అంచనా వ్యయంతో 25 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు చేపట్టగా అందులో రూ.30.10 కోట్ల వ్యయంతో 9 పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగతా వాటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మోడ్రన్ కిచెన్, పారింగ్ సౌకర్యం, పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, పెళ్లికి వచ్చిన బంధువుల కోసం ప్రత్యేక స్నానాల గదులు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్, కమ్యూనిటీ హాల్, రెండంతస్తుల భవనాలు నిర్మించి ఎలాంటి సమస్య లేకుండా వేడుకలు నిర్వహించుకునే చర్యలు చేపట్టారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో జీహెచ్ఎంసీ 100 శాతం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. నగరంలో ప్రతిరోజు 6 వేల మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 4,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్నారు. కమర్షియల్ ప్రాంతాల ప్రధాన రహదారుల్లో వచ్చే చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించి శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నారు.
నగర ప్రజలకు చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించుటకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. వివిధ ప్రాంతాల్లో పారులను అభివృద్ధి చేయడంతో పాటు ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ మియావాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్స్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ల సుందరీకరణ, ట్రీ పార్ల వంటివి ప్రారంభించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరగడం గమనార్హం. గతంలో 33.15 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా.. హరితహారం వల్ల అది 81.81 చ.కి.మీ.లకు పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించాయి. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ ఘనత సాధించింది.
వందేళ్ల తర్వాత 2020 అక్టోబర్‌లో కురిసిన వర్షాలు గ్రేటర్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దీంతో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగానే స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) తొలి విడత పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.985.45 కోట్లతో చేపట్టిన పనుల్లో ఒకటి,రెండూ మినహా దాదాపు 80 శాతం మేర పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ, శివారులు కలిపి 57 చోట్ల పనులకుగానూ ఇప్పటికే 3 చోట్ల పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 100 శాతం పనులు పూర్తి చేసుకుని 13 చోట్ల నాలా అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఎన్డీపీ రెండో దశలో రూ.5135.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. జీహెచ్ఎంసీకి సంబంధించి 148 పనులకు గానూ రూ.2141.22 కోట్లు, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.2993.93 కోట్లతో 267 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు.