ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, డైరెక్టర్ దేవసేనతో కలిసి విద్యార్థులకు రాగి జావ, నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు రూ.91 కోట్లతో నోట్ బుక్స్, రూ.150 కోట్లతో స్కూల్ డ్రెస్‌లు, రూ.192 కోట్లతో టెస్టు బుక్స్ అందజేస్తున్నామన్నారు. రూ. 3500 కోట్లతో మన ఊరు మన బడి కింద 9వేల పాఠశాలల రూపురేఖలు మార్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.1.25లక్షలు సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే బాగ్‌లింగంపల్లిలోని ముషీరాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యా దినోత్సవానికి హోంమంత్రి మహమూద్ అలీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన విద్యా దినోత్సవానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
బడంగ్‌పేట, జూన్20 : విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ సమూలమైన మార్పులు తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యాదినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, బుక్స్, దుస్తులు, జావా, ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. సీఎం కేసీఆర్ పైసా ఖర్చు కాకుండా పేదల పిల్లలకు నాణ్యమైన విద్యా అందించాలన్న దృఢ సంక్పలంతో పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. మహేశ్వరం నియోజక వర్గం విద్యా హబ్‌గా మారబోతుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చివేశామన్నారు.
విదేశీ చదువులకు భరోసా..
విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. ఉన్నత విద్యను విదేశాల్లో చదువుకోవాలనుకే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20లక్షలు ఓవర్సీస్ స్కాలర్ షిప్ దారా అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్‌ను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.పాఠశాలల్లో విద్యార్థునులకు సెల్ప్డిఫెన్స్ శిక్షణ ఇవ్వాలన్నారు. వారంలో మూడు రోజులు సత్యసాయి ట్రస్టు అధినేత ఆనంద్ విద్యార్థులకు రాగి జావాను అందజేయడం అభినందనీయమన్నారు.
పటిష్టంగా విద్యా వ్యవస్థ..
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకాటి కరుణ అన్నారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ బృందం యాదాద్రి, మహబూబ్‌నగర్‌లో పర్యటించి వారు సంతోషం వ్యక్తం చేసిన్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనీతరు చూసిన బృందం సభ్యులు హర్షం వ్యక్తం చేశారన్నారు.
పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దు..
పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అన్నారు. చిన్న పిల్లలు ఫోన్లలో లిటిల్ కృష్డు కార్టూన్లు చూస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు కథల పుస్తలు ఇవ్వాలన్నారు. జ్ఞానం సంపాదించుకోవాలంటే అన్ని రకాల పుస్తకాలు చదువాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయచితం శ్రీధర్, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి,అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో సూరజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్ రావు, మీర్‌పేట మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ గజ్జల రాంచందర్, ఎంఈవో కృష్ణయ్య, కమిషనర్ నాగేశ్, తదితరులు ఉన్నారు.
చిక్కడపల్లి,జూన్ 20 : గురుకుల పాఠశాలల ద్వారా పేదల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ముషీరాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం అన్ని విధాలుగా వెనబడిపోతుందని కాంగ్రెస్, టీడీపీ నాయకులు అన్నారు. కానీ, నేడు సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం పట్ల నేడు పేదలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో డీప్యూటీ డీఈవో చిరంజీవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, నోడల్ ఆఫీసర్ పవన్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, యువజన విభాగం నాయుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోజస్, దామోదర్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, సిరిగిరి శ్యామ్, సోమ సుందర్, శ్రీధర్‌రెడ్డి, సిరిగిరి కిరణ్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ గుప్త, నితిన్, సాయి పాల్గొన్నారు.
మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. పదేళ్లకాలంలో దేశంలోని అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే దేశ వ్యాప్తంగా ర్యాంకులు సాధించి సత్తాచాటుతున్నారని, దీనికి సీఎం కేసీఆర్ కృషే కారణమన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి వల్లే నేడు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న అద్భుత ఫలితాల విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ అమోఘమని మంత్రి అభినందించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మంత్రి ట్యాబులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా విద్యాధికారి విజయకుమారి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్లు ప్రణిత, కొండల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు అనిత, శైలజ, ఎల్లుబాయి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్, జూన్ 20 : హరితహారం ద్వారా తెలంగాణలో 7.5 శాతం అడవులను, పచ్చదనాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్‌లోని చిదానందం కాలనీలో కొత్తగా అభివృద్ధి చేసిన ‘తెలంగాణ దశాబ్ది పార్కు’ ను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ.పవన్‌కుమార్ గౌడ్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే ముఖ్యమని చెప్పారు. మూడు దశాబ్దాల పాటు కోర్టు వివాదంలో ఉండి, కేసు ముగిశాక 720 చదరపు గజాల్లో తాము పార్కును అభివృద్ధి చేసి కాలనీవాసుల చిరకాల వాంఛను నెరవేర్చామన్నారు. అనంతరం వెంకటాపురం కాలనీలో రూ.40 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు, సాయిబాబా ఆలయం వెనుక రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు, సిమెంట్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో రూ.26 లక్షలతో ఏర్పాటు చేయనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి తలసాని, కార్పొరేటర్ కే హేమలత కలసి ప్రారంభించారు.
అడ్డగుట్ట, లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు బుక్స్, యూనిఫామ్‌లను అందజేత
అడ్డగుట్ట, జూన్ 20 : మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అడ్డగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లాలాపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించి రూ. 50 లక్షల వ్యయంతో సమకూర్చిన వివిధ సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ..మన బస్తీ – మన బడి’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని 10 ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ ప్రజల 50 సంవత్సరాల కలను నెరవేర్చే విధంగా సీతాఫల్మండిలో నూతనంగా జూనియర్, డిగ్రీ కాలేజీలను స్థాపించామని, వాటికి రూ.30 కోట్లతో కొత్త భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యా ప్రాంగణాన్ని కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పేదలకు ఎల్లప్పుడు వైద్యసేవలు అందుబాటులో ఉండేవిధంగా బస్తీ దవాఖానలను నెలకొల్పామని, కుట్టీవెల్లోడి దవాఖానను సకల సదుపాయాలతో సూపర్‌స్పెషాలిటీగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలియజేశారు.
సొంత డబ్బులతో కంఫ్యూటర్ల అందజేత..
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడ్డగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యయులకు మూడు కంఫ్యూటర్లను, ప్రింటర్ యంత్రాన్ని సొంత డబ్బులతో అందజేశారు. అదేవిధంగా పదోతరగతి పరీక్షల్లో ప్రతిభను చాటిన లాలాపేటలోని 10 మంది ఉత్తమ విద్యార్థులకు నగదు పారితోషికాన్ని అందించారు. అలాగే అడ్డగుట్ట శాస్త్రినగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణులకు డిప్యూటీ స్పీకర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి, యువనేతలు కిశోర్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నగర గ్రంథాలయ డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.
బేగంపేట్ జూన్ 20: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధ్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాంగోపాల్‌పేట్ డివిజన్లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మనబస్తీ-మనబడి అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం అందించిన యూనిఫామ్స్, పాఠ్య, నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ప్రగతి నివేదికను హెచ్ఎం ఉమాదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, పాల్గొన్నారు.
అడ్డగుట్ట, జూన్ 20 : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్షిప్ను అందించి విద్యార్థుల విదేశీ విద్య కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలను జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కడారి స్వామి, కోతి విజయ్, జంగం అవినాష్, రఘురాం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సిగ వెంకటేశ్ గౌడ్, చటారి దశరథ్, హరిబాబు, కృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు నవీన్ గౌడ్, జంగయ్య, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యాదినోత్సవాన్ని జిల్లాలోని పాఠశాలల్లో అంగరంగ వైభోవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పిల్లలకు రాగి జావా సరఫరా చేయడంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలబాలికలకు రెండు జతల ఉచిత యూనిఫారాన్ని కూడా అందచేశారు.
యూనివర్సిటీలు, కాలేజీల్లో..
ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలతో పాటు పలు కాలేజీలలో సభలు, సమావేశాలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాసరచన పోటీల వంటి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. అబిడ్స్‌లోని పలు స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ, డీఈవో ఆర్ రోహిణి, పాల్గొన్నారు.