అంబర్‌పేట, ఏప్రిల్ 29: అవగాహన రాహిత్యంతో కొంత మంది కాంగ్రెస్ నేతలను సంతృప్తి పరిచేందుకు హైడ్రా బతుకమ్మకుంట అభివృద్ధి పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని బీఆర్ఎస్ అంబర్‌పేట నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టేటస్కో కొనసాగుతున్న సమయంలో హైడ్రా అధికారులు తమ దుందుడుకు చర్యలతో బతుకమ్మకుంట అభివృద్ధి కోసం రూ.8 కోట్లు ఖర్చు చేయడం అవివేకమన్నారు.
బుధవారం ఛే నంబర్లోని ఆయన నివాసంలో ఎడ్లసుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కండ్లలో ఆనందం చూసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మకుంటపై హైడ్రాను ఉసికొల్పారని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు చర్యలకు బీజేపీ సైతం మద్దతు తెలిపి.. వారు చేసిన ధర్నాలో పాలుపంచుకోవడం హాస్యాస్పదమన్నారు.
బతుకమ్మకుంటపై జోరుగా ఆర్భాట ప్రచారం చేసిన వారు ఇప్పుడు కోర్టు తీర్పుతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు తాను బతుకమ్మకుంట స్థలాన్ని తీసుకున్నానని, పార్టీకి సొంత వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికైనా అవగాహన రాహిత్యంతో వ్యవహరించాలని హితవు పలికారు. బతుకమ్మకుంటపై చేసిన ప్రజాధనాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.