ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 17: సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలను బీఆర్ఎస్వీ నాయకులు చేస్తారని ముందస్తుగానే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తార్నాకలోని తన ఇంటి నుంచి బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆలకుంట హరి, హాస్టళ్ల నుంచి బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, మిథున్ ప్రసాద్, నరేశ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరెస్టులు, జైలు జీవితాలు, దాడులు తమకు కొత్తకాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా వీటిని ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అప్పటి నయవంచన కాంగ్రెస్ ప్రభుత్వం నానా కష్టాలు పెట్టినా పోరాటంతో స్వరాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. పదేళ్లు తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాలనలో మరణించిన తెలంగాణ బిడ్డల స్మరణకై అమరుల జ్యోతిని సైతం నిర్మించుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర పాలనకు హృదయం వంటి సచివాలయాన్ని నిర్మించి, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే, ఆ స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. కష్టపడి చీమలు నిర్మించుకున్న పుట్టలో పాములు దూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ పాలన ఉన్నదని మండిపడ్డారు. చలిచీమల చేతిలో పాములు అంతమయ్యాయనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అజ్ఞానపు కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.