DSC | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : “చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.” ఇప్పుడు హైదరాబాద్ విద్యాశాఖది ఇదే పరిస్థితి. ఖాళీలను గుర్తించకుండా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. నగరంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర టీచర్లను కేటాయించకపోవడం.. అవసరం లేని దగ్గర టీచర్లను కేటాయించడంపై నమస్తే తెలంగాణ సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై హైదరాబాద్ విద్యాశాఖాధికారి రోహిణి స్పందించారు. ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించడానికి డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎల్లది కీలక పాత్ర అని ఆమె చెప్పారు. వారితో అనేకసార్లు సమావేశం నిర్వహించి వేకెన్సీలపై రిపోర్ట్ రెడీ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. కానీ కొంతమంది డిప్యూటీఈఓ, డిప్యూటీ ఐఓఎస్లు కావాలనే కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా.. ఖాళీలను చూపించకపోవడం జరిగిందని స్పష్టం చేశారు. వారికి నోటీసులు జారీ చేసినట్టు ఆమె చెప్పారు.
డీఎస్సీ-2024 టీచర్ల భర్తీ ప్రక్రియపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇష్టానుసారంగా జరిగింది. ఖాళీలను సరిగా గుర్తించలేదని స్పష్టమైంది. ఇప్పుడు తప్పు మీదంటే మీది అంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. ఖాళీలపై సమాచారం ఇచ్చామని నోటీసులు అందుకున్న ఓ డిప్యూటీ ఐఓఎస్ తెలిపారు. మరోవైపు కొందరు ఖాళీలు చూపించలేదని డీఈఓ చెబుతున్నారు. వీరి వాదన ఎలా ఉన్నా.. చివరికి ప్రభుత్వ పాఠశాల చదువులపై ఆధారపడిన విద్యార్థులకు మాత్రం నష్టం జరిగింది. ఉపాధ్యాయుల కొరతతో వాళ్ల చదువు ఆగమయ్యే పరిస్థితులు వచ్చాయని విద్యా నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టీచర్ల భర్తీపై కనీస అవగాహన లేకుండా విద్యాశాఖాధికారులు దృష్టి సారించకపోవడం శోచనీయం. కాగా ఈ తతంగంపై కలెక్టర్ సైతం ఆరా తీసినట్టు తెలిసింది. బుధవారం బాధ్యులు వివరణ ఇచ్చిన అనంతరం కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కాగా, డీఈఓ రోహిణి తనపై కావాలనే ఓ ఉపాధ్యాయ సంఘం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీచర్ల భర్తీలో తాను ఎలాంటి ఇష్టానుసారంగా వ్యవహరించలేదని నమస్తే తెలంగాణకు వివరించారు.