బడంగ్‌పేట: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలు, కాలనీల్లో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగాపులు కాసేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కుర్మల్ గూడ, మల్లాపూర్, నాదర్ గూల్, గుర్రం గూడా పరిధిలోని పలు కాలనీల్లో, జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహిన్ నగర్, వాదే ముస్తఫా, పహాడీ షరీఫ్, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్, రాఘవేంద్ర కాలనీ, కమలానగర్ ఇతర ప్రాంతాల్లో నీటి సమస్య ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
డ్రమ్ముల్లో నీరు పట్టుకొని..
పేదలు నివాసముండే కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కుర్మల్ గూడ లో నీటి సమస్యతో ప్రజల అల్లాడిపోతున్నారు. ఆటోల్లో డ్రమ్మును పెట్టి నీళ్లు దొరికే ప్రాంతాలకు వలసలు పోతున్నారు. బోర్లు ఉన్న వాళ్లను బతిమిలాడుకొని.. డ్రమ్ముల్లో నీటిని పట్టుకొని పోతున్నారు. 15 రోజులకోసారి వచ్చే మంచినీళ్ల కోసం మహిళలు నీటి యుద్ధాలే చేస్తున్నారు. కాగా, మార్చి మాసంలోనే నీటి సమస్య ఇలా ఉంటే ఏప్రిల్.. మే లో నీటి కష్టాలు తారాస్థాయికి చేరి ప్రమాముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే
కుర్మల్ గూడలో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే. కాలనీవాసులు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. బోర్లు వేయించాలని ఫిర్యాదు చేశారు. అక్కడ చాలా బోర్లు వేశాం. మరో మూడు బోర్లు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడుతున్నాం. వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చాలా చోట్ల నీటి సమస్యలు ఉన్నట్లు తెలుస్తున్నది. దశల వారీగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.
– కమిషనర్ సరస్వతి
ప్రభుత్వం స్పందించడం లేదు..
డ్రమ్ములను ఆటోల్లో పెట్టుకుని ఇతర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. అసలే వేసవికాలం. నీటి సమస్య జటిలంగా మారింది. ప్రతిరోజూ నీటి కోసం జనం బారులు తీరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్ర వీడడం లేదు. ఎన్నిసార్లు ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
-భాస్కర్ రెడ్డి
మా గోడు ఎవరూ వినడం లేదు..
15 రోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదు. ఎవరినో ఒక్కరిని అడిగి డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకుంటున్నాం. మంచినీళ్లు ఇవ్వకపోయినా సరే కానీ వాడుకోవడానికి బోరు నీళ్లు అన్న ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా గోడు ఎవరూ వినడం లేదు.
– సుజాత
అసలే అరకొర.. ఆపై లో ప్రెషర్
దుండిగల్, మార్చి 15: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎండలు ముదరకముందే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా మురికివాడలు బస్తీల్లో ఈ సమస్య అధికంగా వేధిస్తున్నది. అసలే నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా అవుతుండగా, అది లో ప్రెషర్ తో వస్తుండటంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడక తప్పడం లేదు. నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లతోపాటు, కొంపల్లి , దుండిగల్ మున్సిపాలిటీలు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు బస్తీల్లో తాగునీటి ఎద్దడి అప్పుడే మొదలైంది.
గతంలో రోజు విడిచి రోజు వచ్చే తాగునీరు ప్రస్తుతం నాలుగైదు రోజులకు ఒకసారి వస్తుందని, అది కూడా అర కొరగానే వస్తున్నాడంతో ప్రజలు ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. కొన్నిచోట్ల గంటల కొద్దీ సమయం తీసుకుంటున్న జలమండలి వాటర్ ట్యాంకర్లు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం 24 గంటల వరకు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు సైతం ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ అందరకాడికి దండుకుంటున్నారని వాపోతున్నారు.