సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నగరంలో నీటి కష్టాల సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా హైదరాబాద్ మహా నగర పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన నగరంలో మీటరుకు మించి నీటిమట్టం తగ్గిపోగా… మేడ్చల్ జిల్లాలోనైతే 2.11 మీటర్ల లోతుకు జలాలు పోయాయి. జలమండలి నీటి ట్యాంకర్లపై భారం రెట్టింపునకు మించి పెరగడంతో గృహాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల లోప్రెషర్ ..మరికొన్ని చోట్ల మునుపటికంటే తక్కువ నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మార్చి మొదటి వారం ముగియకముందే నగరంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు వేగంగా పడిపోయి బోర్లు మొరాయించడం కనిపిస్తున్నది. తాజాగా భూగర్భజల వనరుల శాఖ విడుదల చేసిన నివేదికలోనూ గత నెల రోజుల్లో భూగర్భజలాలు వేగంగా లోతుకు వెళుతున్నట్లుగా వెల్లడైంది. మేడ్చల్‌లో పది మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలు ఉండగా… రోజులు గడిచేకొద్దీ అంతకంతకూ లోపలికి పోతున్నాయి. ఇదే క్రమంలో ప్రైవేటు నీటి వ్యాపారులు కూడా యధేచ్ఛగా భూగర్భ జలాలను తోడేయటంతో హైదరాబాద్ జిల్లా పరిధిలో గత రెండు నెలల్లోనే మీటరున్నర లోతుకు భూగర్భ జలాలు పోయాయి.
మేడ్చల్ జిల్లాలోనైతే భూ ఉపరితలానికి 13.32 మీటర్ల లోతులో మాత్రమే జలాలు అందుబాటులో ఉండటమనేది ఆందోళన కలిగించే విషయం. రంగారెడ్డి జిల్లాలోనూ గత రెండు నెలల్లో 2.14 మీటర్ల మేర జలాలు కిందకు పడిపోయాయి. మరోవైపు జలమండలి ట్యాంకర్లకు డిమాండు భారీగా పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో జనం ప్రైవేటు ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు నీటి వ్యాపారులు శివారు ప్రాంతాల్లోని భూగర్భ జలాలను యధేచ్ఛగా లాగేయడంతో క్రమంగా అక్కడ కూడా నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి.
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రీ నగర్, వివేకానందనగర్, తులసి నగర్, అల్లాపూర్, జనప్రియ నగర్ ప్రాంతాలకు బోరబండ సెక్షన్ నుంచి తాగునీరు సరఫరా అవుతున్నది. గత రెండు మూడు నెలలుగా పలు కాలనీలో లో ప్రెజర్ తో నీళ్లు సరఫరా అవుతుండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
కుత్బుల్లాపూర్ జోన్: కుత్బుల్లాపూర్ ఐడీపీఎల్ పరిధిలో నాలుగు రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కేవలం అరగంట పాటు లో ప్రెషర్ తో నీటి సరఫరా జరుగుతున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ విలేజ్, జీడిమెట్ల విలేజ్, పేట్ బషీరాబాద్, అంగడిపేట విలేజ్, గోదావరి హోమ్స్, గాయత్రినగర్ వంటి జన సమూహ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి కొరతను తీర్చేందుకు అధికార యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా డిమాండ్ సరఫరాలో అంతరం ఎక్కువగా ఉంటున్నది. కేవలం కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ పరిధిలో రోజుకు 300 బుకింగ్ అవుతున్నాయి. మరోవైపు నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రైవేటు ట్యాంకర్ నిర్వాహకులు ఇదే అదునుగా అమాంతం రేట్లను పెంచుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్ రూ.800 ఉండగా, ప్రస్తుతం రూ. 1000 నుంచి 1500 వరకు ప్రజల అవసరాలు మేరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
సైదాబాద్: ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జలమండలి అధికారులు సరఫరా చేసే ట్యాంకర్ల పై ఆధారపడుతున్నారు. న్యాయస్థానంలో గుడిసెల స్థల వివాదంలో కొనసాగుతుందటంతో ప్రభుత్వం ఇప్పటివరకు వ్యక్తిగత నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో గుడిసె వాసులు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతిరోజు సుమారు 100కు పైగా ఫ్రీ ట్యాంకర్లను అధికారులు పేదలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇంటి ముందు పెట్టిన డ్రమ్ములలో పోసిన నీళ్లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పోతున్నారు.
నెల రోజులు నుంచి వారానికి రెండు సార్లు నీళ్లు వస్తున్నాయి. అది కూడాలో ప్రెషర్‌తో వస్తున్నది. గంటన్నర రావాల్సని నీటి సరఫరా 40 నిమిషాలే వస్తున్నాయి. ఇతర అవసరాలకు బోర్ నీళ్లు కూడా రావడం లేదు.
– జయ శ్రీ. భగత్ సింగ్ నగర్