“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు.. కొందరు అక్రమ వ్యాపారులు వంద అడుగులకో బోరు బావి.. వెయ్యి అడుగుల లోతు వరకు తవ్వి.. జలగల్లా నీటిని తోడేస్తూ.. వేల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తుండటంతో ఆయా గ్రామాల్లో కరువు చాయలు అలుముకున్నాయి. నిన్నటివరకు పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్ని పంచిన ఆ గ్రామాలు నేడు ఎడారిని తలపిస్తున్నాయి. ఇది ఎక్కడో అనుకుంటున్నారా..? ఐటీ హంగులతో దినదినం అభివృద్ధి చెందుతున్న ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల పరిస్థితి ఇది. ఈ దుస్థితికి అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణమంటూ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. అక్రమాలపై చర్యలు తీసుకుంటారో చూద్దాం..!
సారూ.. మా ఊరి పాతాళ గంగ.. పాతాలానికి పడిపోతుంది.. అడ్డుకట్ట వేయండంటూ.. ఆ గ్రామస్తులు రెవెన్యూ అధికారులను రెండు మాసాలుగా వేడుకుంటున్నారు. కానీ వారేమో మాకు క్షణం తీరిక లేదన్నట్లుగా ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. కలెక్టర్ కార్యాలయంలో పనులున్నాయంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఆకుపచ్చని గ్రామాలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయంటే కారణం ఎవరు? ప్రజల గోసను పట్టించుకోకుండా అంతకన్న మిక్కిలి పనులేమైన ఉన్నాయా.? ఈ రెవెన్యూ అధికారులకు అంటూ ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాలు ఒకప్పుడు ఆకుపచ్చని గోదావరి గ్రామాలుగా విరాజిల్లేవి. క్రమేణ భూముల ధరలు పెరగడంతో ఇక్కడ వ్యవసాయాన్ని తగ్గించిన అన్నదాతలు భూములను ప్రైవేటు వ్యక్తులకు వివిధ రకాల వ్యాపార కేంద్రాలకు లీజులకు అప్పగించారు. దీంతో చాలా భూముల్లో మార్బల్స్ దుకాణాలు, ఆట ప్రాంగణాలుగా మారాయి. ఇదిలావుండగా మిగిలిన కొంతమంది వ్యవసాయాన్ని మానేసి అక్రమనీటి వ్యాపారస్తులకు తమ భూములను లీజులకు అప్పగించడంతో గత ఏడాదికాలంగా ఈ ప్రాంతంలో నీటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి రోజూ ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల పరిధి నుంచి సుమారు రెండుకోట్ల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తోడేస్తున్నారు. ఫలితంగా ఆకుపచ్చని గ్రామాలు ఇప్పుడు ఏడారిని తలపించేలా మారాయి. ప్రతి వంద అడుగుల దూరంలో ఒక్కబోరుబావిని తవ్వి అక్కడి నుంచి రాత్రింబవళ్లు నీటిని తోడేసి సొమ్ము చేసుకుంటున్నారు. తమ గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయంటూ స్థానిక ప్రజలు అనేక పర్యాయాలు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యంగానే మారింది.
వెయ్యి అడుగుల
సాగు నీటి సమస్యలు దేవుడెరుగు. కనీసం తాగునీటి కోసం భూగర్భ జలాలను కాపాడాలంటూ విన్నవిస్తే చుట్టుపుచూపుగా రెవెన్యూ సిబ్బంది వచ్చి కంటి తడుపు చర్యలు తీసుకోవడంతో నీటి వ్యాపారస్తులు బరితెగించి నీటిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. క్రమేణ ప్రస్తుతం ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల్లో వెయ్యి అడుగుల లోతుకు నీటి నిల్వలు చేరుకోవడం గమనార్హం. సకాలంలో రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నీటి వ్యాపారాలను అరికట్టి ఉంటే మా ఊర్లు ఇలా కరువును తలపించేవిగా మారేవి కావంటూ ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
అక్రమ నీటి వ్యాపారం ద్వారా మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రజల నిధులతో నిర్మించిన ఈ రోడ్ల పరిరక్షణ బాధ్యత మున్సిపల్ శాఖ అధికారులకు ఉన్నప్పటికీ నీటి వ్యాపారాల నియంత్రణ విషయంలో తమకెలాంటి అధికారాలు లేవంటూ ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన రహదారులు పాడై పోతుంటే పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యవసాయం చేసుకునేందుకు ఏజీఎల్ కనెక్షన్ ద్వారా విద్యుత్‌ను అందించాల్సి ఉంటుంది. కానీ ఇవే కనెక్షన్లను పెట్టి యథేచ్ఛగా నీటి వ్యాపారాలు చేస్తున్నారు. అయినా ఆ శాఖ అధికారులకు పట్టింపే లేదు. విద్యుత్ మీటర్ల మంజూరులో కమర్షియల్‌గా కేటాయింపులు చేపట్టాలి కానీ ఏనాడు ఆశాఖ అధికారులు పర్యటించి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన రహదారులు, అక్రమ విద్యుత్ వినియోగంతో పాటు ప్రకృతి అందించే భూగర్భ జలాలను విచ్ఛిన్నం చేస్తున్న అక్రమనీటి వ్యాపారస్తులపై ఇప్పటి వరకు ఏ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించలేదంటే వ్యాపారాలు ఏస్థాయిలో కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఖానాపూర్, వట్టినాగులపల్లిలో గత నెలరోజులుగా తాగునీటి సమస్యలు తీవ్రతరంగా మారాయి. అక్రమ నీటి వ్యాపారాలతో గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అయినా నీటి వ్యాపారాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెవెన్యూ అధికారులపై రెండు గ్రామాల ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆకుపచ్చని గ్రామాల్లో చోటుచేసుకున్న కరువుకు బాధ్యులెవరు.? రెవెన్యూ అధికారుల అక్రమవసూళ్లా.. లేక నిర్లక్ష్యపు ధోరణియా.? అని ప్రశ్నిస్తున్నారు. అంటున్నారు. ఎప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పనులున్నాయంటూ వెళ్లే అధికారులకు అక్కడేం పని.. అక్కడే విధులు నిర్వహించుకోవచ్చు కదా.. అంటూ ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక సమస్యలపై స్పందించని అధికారులు మాకెందుకని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమనీటి వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.