మేడ్చల్, మార్చి 16 : మేడ్చల్‌లో వేసవి ప్రారంభంలోనే నీటి కటకట మొదలైంది. పట్టణంలో ఎటూ చూసినా నీటి ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అంతంగా వస్తున్న మిషన్ భగీరథ నీరు.. మండిపోతున్న ఎండలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. నీటి పథకం నిర్వహణ లోపాలు వెరసి పదేండ్ల తర్వాత మళ్లీ నీటి ఎద్దడి పరిస్థితులు దాపురించాయి.
మేడ్చల్ పట్టణంలో మిషన్ భగీరథ నీరు రాక ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే వేసవికి రెండు నెలల ముందే అంటే జనవరి చివరి వారం నుంచే ట్యాంకర్ల కోసం వేచి చూడాల్సి వచ్చేది. మున్సిపాలిటీకి చెందిన దాదాపు 200 బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినా.. నీటి అవసరాలు తీరేవి కావు. ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారం జోరుగా సాగేది. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల నివాసితులు అవసరాల కోసం రోజుకు మూడు, నాలుగు ట్యాంకర్ల వరకు తీసుకునే పరిస్థ్థితి ఉండేది.
ప్రతి రోజూ నీటి యుద్ధాలే దర్శనమిస్తుండేవి. బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీకి రూ.42 కోట్లు ప్రత్యేకంగా వెచ్చించి, మిషన్ భగీరథ నీటిని అందజేసింది. దీంతో నీటి సమస్య శాశ్వతంగా దూరమైంది. దీంతో ట్యాంకర్లు మూలన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 20 రోజులగా నీటి కటకట మేడ్చల్‌లో ప్రారంభమైంది.
మిషన్ భగీరథ నీటి సరఫరా మెరుగుపర్చకపోతే తాను వచ్చి ధర్నా చేస్తానని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అధికారులకు అల్టీమేటం జారీ చేశారు. మున్సిపాలిటీ వాసులు పలువురు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఫోన్లో అధికారులతో మాట్లాడారు. ‘డీఈ గారూ…మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా జరగడం లేదు. కనీసం గంట పాటైనా నీళ్లు ఇవ్వకపోతే ఎలా’ అని ప్రశ్నించారు. నీటి సరఫరా మెరుగుపర్చకపోతే తానే వచ్చి ధర్నా చేస్తానని హెచ్చరించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి సమస్య తీవ్రమైందన్న విమర్శలున్నాయి. పలుచోట్ల నీటి లీకేజీ అవుతున్నది. మేడ్చల్-కిష్టాపూర్ దారిలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవుతున్నది. పైపులైన్ లీకేజీతో నడిరోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, నీరు మురుగు కాల్వ పాలవుతోంది. అయినా ఇటు మున్సిపాలిటీ గానీ, అటు మిషన్ భగీరథ పథకం అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపు 10 నెలల నుంచి పరిస్థితిని చక్క దిద్దడం లేదు.
పదేండ్ల తర్వాత ట్యాంకర్ల వ్యాపారం జోరుగా సాగుతున్నది. రోడ్లపై ప్రైవేట్ ట్యాంకర్లు పరుగులు పెడుతున్నాయి. వ్యవసాయ బోర్ల నీటిని ట్యాంకర్లలో నింపి అమ్ముకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్ రూ.550 నుంచి రూ.600 పలుకుతున్నది. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్రనగర్, ఎంఆర్ఎఆర్, కిష్టాపూర్, ఎన్జీవోఎస్, కేఎల్ఆర్, అత్వెల్లి, బాలాజీనగర్, వినాయక్‌నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
ప్రతి ఇంటి బోరు అడుగంటడం, మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లపైనే ఆధార పడుతున్నారు. 10 మంది నివసిస్తున్న భవనానికి ప్రతి రోజూ ఒక ట్యాంకర్‌ను వినియోగిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, అపార్టమెంట్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఫిబ్రవరి మొదలుకుంటే వర్షాలు పడే జూన్, జూలై వరకు ఒక్కో కుటుంబం ఎంత లేదన్నా నీటి కోసం కనీసం రూ.40 నుంచి రూ.50వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ప్రైవేట్ ట్యాంకర్లతో పాటు మున్సిపాలిటీ ట్యాంకర్ల కూడా నీటి సరఫరాను ప్రారంభించాయి.