Gandhi Hospital | బన్సీలాల్ పేట్, మే 12 : రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు. దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 72 లక్షల వ్యయంతో సుజలం సురక్షిత తాగునీరు పేరుతో 23 చోట్ల ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లను నెలకొల్పింది. ఎక్కువగా ప్రజలు ఉండే ఓపీ భవనం, క్యాజువాలిటి ఎదురుగా, డైట్ భవనం, ఎంసీహెచ్ భవనం వద్ద నాలుగు పెద్ద ప్లాంట్లను సోమవారం ఆమె ప్రారంభించారు. అన్ని ఫ్లోర్లలో కూడా వాటర్ కూలర్లను ప్రజల కోసం ఏర్పాటు చేశామని, తద్వారా తాగునీటి లభ్యత అన్నిచోట్లా అందుబాటులో ఉన్నదని ఆమె అన్నారు. దాతలకు ఆమె ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దివీస్ ల్యాబ్ ప్రతినిధులు నగేష్, శ్రీనివాస్, ఆర్ఎంఓలు డాక్టర్ శేషాద్రి, సుధార్ సింగ్, రజినీ, యోగేందర్, నవీన్, సుధీర్, సరిత, మీనాక్షి, కల్యాణ్ చక్రవర్తి, నజీమ్, సీఎంఓ రాజు పాల్గొన్నారు.