తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 24: ఒక వార్త కంటే ఫొటో ఎంతో విలువైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హై ఆక్టేన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్ ముగింపు సందర్భంగా ఉత్తమ ఫొటోలకు గురువారం అవార్డులను ప్రదానం చేశారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ, పేపర్ నిండా వచ్చే వార్త కంటే ఒక ఫొటో ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నదని అన్నారు. కళాత్మకంగా ప్రతిభతో ఫొటోలు తీయడం గొప్ప కళగా ఆయన అభివర్ణించారు. ప్రముఖ నటులు మైమ్ మధు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎంపీ మధుయాష్కి, టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కేశవులు, డాక్టర్ మహ్మద్ రఫీ పాల్గొని ఫొటోగ్రఫీ గొప్పదనాన్ని వివరించారు.
ఒడిలో చిన్నారిని ఉంచుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ తల్లి ఫొటోను తన కెమెరాలో బంధించిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఫొటోగ్రాఫర్ గడసంతల శ్రీనివాస్‌కు మొదటి బహుమతి కింద రూ.10 వేల నగదుతో పాటు కన్సోలేషన్ బహుమతి యాదాద్రిలో పీర్ల పండుగ ఫొటో, తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన సచివాలయంతో పాటు అమరుల దీపజ్యోతి ఫొటోకు గాను రెండో బహుమతి ఈనాడు పత్రిక ఫొటోగ్రాఫర్ ఆవుల శ్రీనివాస్, బోనాల ఉత్సవాల పండుగ ఫొటోకు మూడో బహుమతి సాక్షి పత్రిక ఫొటోగ్రాఫర్ బాలస్వామి అందుకున్నారు. ప్రోత్సాహక బహుమతులను ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఫొటోగ్రాఫర్ నర్రె రాజేష్ అందుకున్నారు. పండుగలు, సాంస్కృతిక ప్రోత్సాహక బహుమతి ఈనాడు సతీశ్, అభివృద్ధిని కళ్ళకు కట్టిన ఫొటోలు తీసిన సాక్షి శివ కుమార్ (యాదాద్రి), సాక్షి యాకయ్య (సూర్యాపేట), న్యూస్ ఫొటోస్ ప్రోత్సాహక బహుమతులను హన్స్ ఇండియా శెట్టి, ఈనాడు సతీశ్‌లు అందుకున్నారు.