ఎల్బీనగర్: మ్యాజిక్ మనీ పేరుతో నగదును రెట్టింపు చేస్తానని నమ్మించి నగదుతో ఉడాయించిన ఉదంతం చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. సాయి కల్యాణ్, ఆనంద్ స్నేహితులు. ఆనంద్ స్నేహితుడైన శ్రీనివాస్‌ను సాయి కల్యాణ్‌తో పరిచయం చేశాడు. మ్యాజిక్ మనీ ద్వారా డబ్బులను రెట్టింపు చేయడం శ్రీనివాస్‌కు వచ్చునని చెప్పాడు. శ్రీనివాస్ రవి అనే వ్యక్తిని ఫోన్ చేసి పిలిపించాడు.
తనకు ఎంత డబ్బు ఇస్తే మ్యాజిక్ ద్వారా అంత రెట్టింపు డబ్బులను ఇస్తామని రవి నమ్మబలికాడు. నమ్మిన సాయి కల్యాణ్ స్నేహితులైన ఆనంద్, శ్రీనివాస్‌లతో కలిసి రూ. 1.75 లక్షల నగదును రవికి అందజేశారు. ఈ డబ్బులను రూ. 5 లక్షలు చేసి ఇస్తానని రవి నమ్మించాడు. నగదును ఓ బ్రౌన్ రంగు బాక్స్‌లో పెట్టినట్లు మభ్యపెట్టి.. బాక్స్ పైన ఆకుపచ్చ రంగు టేప్‌తో చుట్టి దానికి పింక్ రంగు ఇంజక్షన్ ఇచ్చి..దానిని శ్రీనివాస్ నివాసంలోని ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. తర్వాత రవి పత్తాలేకుండా పోయాడు. ఫ్రిడ్జిలో పెట్టిన బాక్స్‌ను తెరిచి చూడగా, అందులో తెల్లకాగితాలు కనిపించాయి. బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.