శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Sep 05, 2020 , 00:30:12

త్వరలోనే డబుల్‌ ఇండ్లు

త్వరలోనే డబుల్‌ ఇండ్లు

లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం

పెండింగ్‌లో ఉన్న సమస్యలను పూర్తిచేద్దాం

నగర ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు త్వరలోనే సుమారు 85 వేల ఇండ్లు అందించేలా ముందుకెళ్తున్నామని, ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బల్దియా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రజల స్పందనను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో చేపట్టే వివిధ కార్యక్రమాలను కూడా వారికి వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాటిని మరింత వేగవంతం చేస్తామన్నారు. ఐదేండ్లుగా బల్దియా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పను లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సయయంలో పెద్ద ఎత్తున రహదారుల విస్తరణ, నిర్మాణం చేయడం ద్వారా ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెప్పారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ విషయంలోనూ సాగునీటి శాఖతో కలిసి సమన్వయంతో ముందుకుపోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యేలకు చెప్పారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నవి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.