Pending Bills | సిటీబ్యూరో: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీకి అల్టిమేటం జారీ చేశారు. పనులు చేయలేం..చేసిన కాడికి బిల్లులివ్వండి అంటూ.. ప్రస్తుత ధరలకు అనుగుణంగా రేట్లను పెంచితే ఆలోచిస్తామంటూ అధికారుల ముందు తాజా డిమాండ్‌ను పెట్టారు. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ. 2823.49 కోట్లు అవసరమని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాంట్రాక్టర్లకు సంబంధించి రూ. 200కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండడం, బకాయి వచ్చే వరకు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ససేమిరా అంటుండడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. 2015లో ఈ స్కీం కింద వంద శాతం సబ్సిడీతో ఈ ప్రాజెక్టును రూ.9714.59 కోట్లతో శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంలో ఒక్క ఐడీహెచ్ కాలనీలో ఇండ్లను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. 108 ప్రాంతాల్లో 97,629 పనులు పట్టాలెక్కించగా,..కొన్ని సాంకేతిక కారణాలతో 2371 ఇండ్ల పనులు ప్రారంభించలేదు. ఈ పథకంలో భాగంగా మురికివాడల్లోని పాత ఇండ్లను కూల్చేసి వాటి స్థానంలో (ఇన్సిటూ) 39 ప్రాంతాల్లో 8474 ఇండ్లను నిర్మించారు.
69 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 89155 ఇండ్ల పనులు చేపట్టారు. వీటితో ఇప్పటి వరకు 73 ప్రాంతాల్లో 69, 633 ఇండ్లను లబ్ధిదారులకు కేసీఆర్ సర్కారు అందజేసింది. కానీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. ఉన్న ఇండ్లలో మౌలిక వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భాగంగా ఇండ్లను కోల్పోయిన వారికి కేసీఆర్ సర్కారు కట్టించిన 16వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు.
మొదటి దశలో 14 ప్రాంతాల్లో 1672 ఇండ్లను కేటాయించారు. వీరిలలో 311 మంది లబ్ధిదారులు మాత్రమే ఇండ్లలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణం అసంతృప్తిగా ఉండడంతో మరికొంత మందికి ఇచ్చే ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం 27,966 ఇండ్లను సకాలంలో పూర్తి చేయలేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టలేక చేతులెత్తేయడంతో ఎక్కడి ఇండ్లు అక్కడే నిలిచిపోవడం గమనార్హం.