GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 27, (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. పెరుగుతున్న కుక్కల జనాభాతోపాటు వాటి బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోని ఫీవర్ ఆసుప్రతికి రోజుకు 70 నుంచి 80 మంది కుక్కకాటు బాధితులే వస్తున్నారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కుక్కల సంఖ్య తగ్గుతుందని, వాటికి కుటుంబనియంత్రణ నిర్వహిస్తున్నామని అధికారులు లెక్కలు చెప్పడం గమనార్హం. 2019లో నిర్వహించిన 20వ పశుగణన ప్రకారం హైదరాబాద్ లో 51వేల కుక్కలు ఉన్నాయి. నాటినుంచి ఇప్పటివరకు ఆ సంఖ్య మరింత పెరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు అధికారులు నేటికీ పాత లెక్కల ఆధారంగానే వాటి సంఖ్యను తెలుపుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పశుగణన త్వరగా పూర్తిచేసి కుక్కల లెక్కలు జిల్లాలోని ప్రాంతాల వారీగా తెల్చి, కుక్కకాటుకు సరిపడా వాక్సిన్లు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆగుతూ సాగుతోంది
21వ అఖిల భారత పశుగణన సర్వే గడువులోగా పూర్తిచేయడం కష్టంగా మారింది. గత ఏడాది నవంబర్ మొదటివారం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు 16రకాల జంతువులు, పక్షులను లెక్కించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆవులు, గేదేలు, పెంపుడు కోళ్లు, కుక్కలు, ఒంటెలు, గుర్రాలు, మేకలు, గొర్రెలు ఇలా మొదలైన వాటికి పశుగణన చేయాల్సిందిగా సూచించింది. అందులో భాగంగా మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా పశుగణన గడువులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం తెలపడం గమనార్హం. అయితే ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి 21వ పశుగణన యాప్లో మ్యాపింగ్ ఆధారంగా సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వాలు మందులు, ఇతర ప్రోత్సాహాకాలు విడుదల చేస్తుంటాయి. హైదరాబాద్ జిల్లాలో 9,60,000గృహాల్లో ఈ పశుగణన సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇందుకు గాను 128 మంది ఎన్యూమరేటర్లు, 30 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఈ సర్వే ఈ నెల 28 నాటికి చివరి తేదీకాగా ఇప్పటివరకు 5,60,000గృహాల్లో సర్వే నిర్వహించారు.
మ్యాపింగ్ సమస్యలతోనే ఆలస్యం..
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా పశుగణన చేసే సందర్భంలో మ్యాపింగ్ సమస్యలతో ఎన్యూమరేటర్లు ప్రారంభ దశలో చాలా ఇబ్బందులు పడ్డారు. దానితో పాటు యజమానుల వద్దకు వెళ్లి వివరాలు అడిగే సందర్భంలో ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాల వల్ల వాళ్లు తమ వివరాలు తెలిపేందుకు సహకరించలేదు.
సహకరించండి..
– డాక్టర్ సంజీవరావు, 21వ పశుగణన నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా
పశుగణన పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. యజమానులు సర్వే సిబ్బందికి సహకరిస్తే త్వరగా పూర్తిచేసేందుకు ఆస్కారముంటుంది. ప్రారంభంలో మ్యాపింగ్ సమస్యలు ఎదురైనా, ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. గడువులోగా పూర్తికావడం సాధ్యం కాదు. మరింత సమయం అవసరం.
2019లో నిర్వహించిన 20వ అఖిల భారత పశుగణన హైదరాబాద్ జిల్లా వివరాలిలా..
జంతువు – సంఖ్య
ఆవులు – 15,635
గేదెలు – 23,327
గొర్రెలు – 13,230
మేకలు – 33,876
గుర్రాలు – 810
గాడిదలు – 11
ఒంటెలు – 31
పందులు – 116
కుక్కలు – 51,472
కుందేళ్లు – 2600
నాటుకోళ్లు – 23055
బాతులు – 1163