Talasani Srinivas Yadav | బేగంపేట, మార్చి 10: నిరుపేదలైన ఫుట్‌పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడాన్ని అధికారులు మానుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అధికారులను హెచ్చరించారు.
రాంగోపాల్‌పేట, నల్లగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఫుట్‌పాత్ వ్యాపారులు, జీహెచ్ఎంసీ షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారు సోమవారం నాడు వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో తలసానిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు అద్దెలు పెంచుతామని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేద వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఫుట్‌పాత్‌లపై , తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తలసాని తెలిపారు. వారికి జీవనాధారం లేకుండా చేసి వారి కుటుంబాలను రోడ్ల పాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి తప్ప.. అసలు వ్యాపారాలే చేసుకోకుండా ప్రయత్నించడం తగదని సూచించారు. అసలే వ్యాపారం జరగక ఇబ్బందులు పడుతున్న సమయంలో GHMC అధికారులు షాపుల అద్దెలను పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వ హయాంలోనే GHMC షాపుల అద్దెలను పెంచాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారని తెలిపారు. కానీ పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం అద్దె పెంపు ప్రతిపాదనలను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపుల అద్దెలను ఒక్కసారిగా మూడు రెట్లు పెంచిందని, ఇది పేదలకు ఆర్ధికంగా ఎంతో భారం అని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే వ్యాపారులకు మద్దతుగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.