Ration Rice | అంబర్‌పేట, జూన్ 1 : పౌరసరఫరాల శాఖ అంబర్‌పేట సర్కిల్ పరిధిలో అమలు చేస్తున్న మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ ఇక్కడి డీలర్లకు తలనొప్పిగా మారింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో, కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని అందజేయడానికి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడం, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్‌తో పాటు పంచదార, గోధుమలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఆదివారం నుండి అంబర్‌పేట సర్కిల్ పరిధిలోని అన్ని చౌకధరల దుకాణాల డీలర్లు లబ్ధిదారులకు వచ్చే మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో మూడు నెలల సరుకులు పంపిణీ చేస్తుండడంతో డీలర్లు ఒక కార్డు దారుడికి సంబంధించి మూడుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో డీలర్ ఒక కార్డుదారుడికి రేషన్ ఇవ్వడానికి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్ వేర్ సమస్యను పరిష్కరించడంతో పాటు బ్లూ టూత్ మిషన్ విషయంలో సడలింపు ఇవ్వాలని, ఒక కుటుంబానికి చెందిన బియ్యం ఒకేసారి పంపిణీ చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ-పాస్, ఎలక్ట్రానిక్ కాంటాక్టు బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభమవుతుందని వారు సూచిస్తున్నారు.
అదేవిధంగా 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం ద్వారా వాటిని నిల్వ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని రేషన్ డీలర్లు అంటున్నారు. సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో 90 శాతానికి పైగా లబ్దిదారులు బియ్యం తీసుకెళ్తున్నారని, వీటిని పంపిణీ చేయడానికే 2 సార్లు లోడ్ తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు 3 నెలలకు సంబంధించి బియ్యం నిల్వ చేయడానికి మరో చోట ఇండ్లు అద్దెకు తీసుకోవాల్సి దుస్థితి ఏర్పడిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఒక రూమ్ అద్దె, ఇతర ఖర్చులకే సరిపోవడం లేదని, ఇప్పుడు బియ్యం నిల్వ కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆర్థిక భారం మీద పడుతుందని వారు వాపోతున్నారు. అలాగే తూకం వేయడానికీ సహాయకుల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుందని, దీంతో వారికి జీతభత్యాలు ఇవ్వడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.