సిటీబ్యూరో/అబిడ్స్, సుల్తాన్‌బజార్, జూన్ 7 : మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. టోకెన్లు కొనుగోలు చేసి..మైదానంలోనే సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు చేస్తున్నాయి. ఎగ్జిబిషన్ మైదానంలో నేడు తెల్లవారుజాము నుంచి మరుసటి రోజు ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని, ఈ నేపథ్యంలో 2 రోజులు పాటు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ వెల్లడించారు. ఇదిలా ఉంటే మృగశిర కార్తెను రోజు చేపలు తినడం ఆనవాయితీ కావడంతో శుక్రవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసింది.