సిటీబ్యూరో, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : దక్షిణ డిస్కంలో మహిళా ఉద్యోగినుల పట్ల వివక్ష కొనసాగుతున్నదంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మింట్‌కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కీచక ఉద్యోగి వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. ప్రతీ ఒక్కరూ ఆ ఉద్యోగి ఎవరనే ఆరా తీశారు. ఐటీ విభాగంలో పనిచేసిన ఆ ఉద్యోగి ప్రస్తుతం సిద్దిపేటకు బదిలీ కావడంతో అతని వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించేశారని, ఇంత జరిగినా ఆ ఏడీఈ మీద ఉన్నతాధికారులకు ప్రత్యేకించి ఆ డైరెక్టర్‌కు ఎందుకంత ప్రేమ అనే కోణంలో ఉద్యోగులు చర్చించుకున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల విషయంలో మాత్రం ఇంకొందరు అధికారుల ప్రవర్తన మితిమీరినట్లుగా ఉన్నప్పటికీ బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఒక డైరెక్టర్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇలాంటి వారిని వెనకేసుకుని రావడం వల్లే ఆ విభాగంలో ఉద్యోగినులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అయితే ఈ సంఘటన జరిగి రెండు నెలలు అవుతున్నా.. బయటకు పొక్కకుండా అతనిని కాపాడుకుంటూ వచ్చిన డైరెక్టర్‌కు ఏ మేరకు లాభం జరిగిందోనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
తనపై ఏడీఈ చేస్తున్న లైంగిక వేధింపులను భరించలేక ఆ మహిళా ఉద్యోగి పోలీస్‌స్టేషన్‌తో పాటు సీఎండీ ముషారఫ్ ఫరూఖికి కూడా ఫిర్యాదు చేశారు. కానీ సీఎండీ తనకు ఆ ఏడీఈ ముఖం చూపించొద్దంటూ చెప్పి సంబంధిత డైరెక్టర్‌ను ఆ ఏడీఈపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అంతేకాకుండా ఒక టీమ్‌ను విచారణ జరపాలని కూడా ఆదేశించారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చినా.. అది బుట్టదాఖలైంది. సాక్షాత్తు సీఎండీ ఆదేశించినా వాటిని బేఖాతరు చేసిన డైరెక్టర్ వ్యవహారంపై మింట్‌కాంపౌండ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ ఏడీఈ తనకంటే చాలా చిన్నదైన ఆ మహిళా ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.