Sherilingampally | శేరిలింగంపల్లి జోన్ , జూన్ 12: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య అసంతృప్తి బహిర్గతమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి విజయానికి శ్రమించిన వారిని పక్కనబెట్టి, గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి పరోక్షంగా కారణమైన వ్యక్తులకు ప్రాధాన్యం పెరుగుతోందని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ప్రత్యేకంగా ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో కాంగ్రెస్కు సుదీర్ఘకాలంగా సేవలందించిన పలువురు నాయకులకు తగిన ప్రాధాన్యం లభించలేదని, అయితే ఇతర పార్టీల నుంచి ఇటీవల చేరిన వారికి అధిక ప్రాధాన్యం దక్కిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతో అసలు కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక శేరిలింగంపల్లి రాజకీయ సమీకరణల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులు కూడా చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం తెలిసిందే. అయితే రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇప్పటికే అంతర్గత పోటీ మొదలైందనే ప్రచారం జరుగుతోంది.
పాత నాయకులకు అవకాశాలు ఇస్తారా..?
స్థానికంగా పార్టీని బలోపేతం చేసిన పాత నాయకులకు అవకాశాలు ఇస్తారా..? లేక ఇటీవల చేరిన ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యం ఉంటుందా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే గ్రేటర్ ఎన్నికల నాటికి అసంతృప్తి మరింత పెరిగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం ప్రతిపక్షాలకు రాజకీయంగా ఆయుధంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అసంతృప్త నేతలను సమన్వయం చేసుకుంటూ, పాత-కొత్త నాయకుల మధ్య సమతుల్యత సాధించడంలో పార్టీ నాయకత్వం ఎంతవరకు విజయవంతమవుతుందన్నదే ఇప్పుడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.
“పార్టీ కోసం పోరాడింది ఒకరైతే.. పదవులు, ప్రాధాన్యం పొందేది మరొకరా?” అనే ప్రశ్న ప్రస్తుతం శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తుండగా, రానున్న గ్రేటర్ ఎన్నికలు ఈ అసంతృప్తికి పరీక్షగా నిలవనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.