సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): మానవాళి జీవన ప్రమాణాలను నిర్వీర్యం చేసే ప్రాణాంతకమైన వ్యాధులలో డయాబెటిస్ ఒకటని, దేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారని కేర్ హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, సీనియర్ వైద్యులు డా. బిపిన్ కుమార్ సేథి స్పష్టం చేశారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా చక్కెర వ్యాధి ప్రభావం, ఆరోగ్యకరమైన జీవనం, నివారణ విధానాలపై అవగాహన కల్పించారు. డయాబెటిస్ వ్యాధి మూలాన భారత్‌పై తీవ్ర భారం పడుతుందని, దేశంలో ఎక్కువ మంది ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నవారే ఉన్నారని తెలిపారు. ఇందులో చాలా మందికి నిర్ధారణ కాలేదన్నారు.
సైలెంట్ కిల్లర్‌గా ఆరోగ్యాన్ని కబళించే వ్యాధి నియంత్రణలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా డయాబెటిస్ రోగుల జీవన శైలి, దృఢమైన మనోబలం, జీవన ప్రమాణాలను కూడా దెబ్బ తీస్తోందన్నారు. రక్తంలో చక్కెర స్థాయి నిర్వహణ, జీవనశైలి అనుకూలతలు, మానసిక, సామాజిక ప్రోత్సాహంతో మధుమేహాన్ని జయించవచ్చన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి రుగ్మతలు కూడా రోగితో కలిసి జీవిస్తాయన్నారు. దీంతోనే మధుమేహ వ్యాధి నియంత్రణలో సమర్థవంతమైన విధి విధానాలతోనే సాధ్యం అవుతుందన్నారు.
జీవన శైలి మార్పులతో డయాబెటిస్ నియంత్రించవచ్చన్నారు. అయితే, కలగానే మిగిలిపోతుందనీ, ఈ విషయంలో రోగికి కుటుంబ సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వ్యాధి నివారణ, నియంత్రించకపోతే గుండె, కళ్లు, మూత్ర పిండాలు, నరాల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు. ప్రాసెస్డ్ షుగర్, సమతుల ఆహారం, సాధారణ శారీరక శ్రమతో వ్యాధి నియంత్రణలో సాయపడుతుందన్నారు. బరువు నియంత్రించగలిగే మందులను ఎంచుకోవాలన్నారు. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు, రెగ్యులర్ హెల్త్ చెకప్లూ, ఎస్జీఎల్టీ-2 ఇన్హిబిటర్స్, జీఎల్పీ-1ఏ వంటి ఔషధాలను వాడాలన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించాలన్నారు. డయాబెటిస్ ఫ్రీ భారత్ కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, మెరుగైన జీవనశైలి, సమతుల ఆహారం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ బిపిన్ సేథ్ పేర్కొన్నారు.