దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్
నాయకులు, రైతులు మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతుల కల్లాలపై కల్లోలం సృష్టిస్తూ.. రైతులను గోసపెడుతున్న బీజేపీని బొందపెడుతామని హెచ్చరించారు. జాతీయ రైతుదినోత్సవం రోజున అన్నదాత నిరసనలు చేపట్టడం దురదృష్టకరమని, ఈ దుస్థితికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ కర్షక వ్యతిరేకవిధానాలను విడనాడాలని హితవు పలికారు. రైతు ఉసురు బీజేపీ నాయకులకు, కేంద్ర
ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని హెచ్చరించారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న కల్లాల నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ సర్కార్ తాఖీదు పంపడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వెనక్కి తీసుకోని నిధులను తెలంగాణ రాష్ట్రం నుంచి వెనక్కి ఇవ్వాలని ఎందుకు అడుగున్నారని ప్రశ్నించారు. దేశంలో చట్టం అందరికీ ఒకేలా ఉండదా..? అనిమండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను వీడనాడాలని సూచించారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.
రైతు వ్యతిరేక బీజేపీని దేశం నుంచి తరిమేద్దామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మహా ధర్నాలో ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను చూస్తేనే ఓర్వడంలేదని, తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి కక్ష్య, కోపం, వివక్ష ఎందుకని ప్రశ్నించారు. రైతులు వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు కడితే ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. రైతుల కల్లాలపై బీజేపీ ఎందుకింత కల్లోలం సృష్టిస్తుందో ఆర్థం కావడం లేదని మండిపడ్డారు. బీజేపీ రైతు వ్యతిరేక దమననీతికి రైతాంగం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో వ్యవసాయానికి సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. దేశంలోని రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, ఇక నుంచి బీజేపీ ఆటలు సాగవని అన్నారు. ఈ మహాధర్నాకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.