సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం అరైవ్ అలైవ్ రోడ్‌సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని సీపీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమ పోస్టర్‌ను సినీ ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని, తెలంగాణ ప్రతి ఏటా 800 మంది హత్యలకు గురవుతుంటే.. అంతకు పదింతలు ఎక్కువగా 8వేల మంది రోడ్డు ప్రమాదాలతో దుర్మరణం చెందారన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ తారకమంత్రమని, పరిసరాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని డీజీపీ తెలిపారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. నగరంలో ఏడాది మూడువేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 300 మంది వరకు మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమ సందేశాన్ని ప్రతిఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జనార్ కోరారు. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలించడంలో దేశంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు బాబూమోహన్ తమ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. యువత సినిమాల్లో హీరోల్లాగా వాహనాలను నడుపవద్దని, వాహనాలను నడిపేటప్పుడు తమ భార్యపిల్లలు, తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని బాబూమోహన్ కోరారు. రోడ్డు ప్రమాదాలు అందరి కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపాయని, ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని సినీ ప్రముఖులు శర్వానంద్, ఆదిసాయికుమార్, బుచ్చిబాబు, సింగర్స్ మను, మోహనబోగరాజు, సినీ దర్శకుడు బుచ్చిబాబు పిలుపునివ్వగా.. ఐజీపీ రోడ్‌సేఫ్టీ రమేశ్, ఐజీపీ పీఅండ్ ఎల్ రమేశ్‌రెడ్డి, క్రైమ్స్ అదనపు సీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్, డా.రాఘవదత్ పాల్గొన్నారు.