సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్హాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఆయా శాఖలు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యుత్, టౌన్ ప్లానింగ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో పురాతన భవనాలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాగిరెడ్డి వివరణ కోరారు.
ఇటీవల గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, అలాంటి పురాతన భవనాల్లో అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖల ద్వారా అవసరమైన సూచనలు ఇవ్వాలని కోరారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముఖ్యంగా జీహెచ్ఎంసీలో వ్యాపార సముదాయాలు, వ్యాపార భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అవగాహన కల్పించి, పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
హెరిటేజ్ బిల్డింగ్లో గాని, ఇతర బిల్డింగ్లో షార్ట్ సర్యూట్ ద్వారా ప్రమాదాలు సంభవించకుండా ఎలాంటి పరికరాలు వాడాలో ఎలక్ట్రికల్ అధికారులు ప్రైవేటుగా ఫిట్టింగ్ చేసే వ్యక్తులకు అదే విధంగా లైన్మెన్లకు పూర్తి అవగాహన కల్పించాలని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ షాప్లు నిర్వహించే యజమానులకు దశల వారీగా అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసమ్ సీఈని కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సేఫ్టీ మెజర్స్ ఉంటేనే ట్రేడ్ లైసెన్స్ గానీ, ఎన్ఓసీ జారీ చేయాలని సూచించారు. నెలకు ఒక రోజు ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు నాగిరెడ్డి వివరించారు.