Hyderabad | బంజారాహిల్స్: ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇక ప్రభుత్వం కోసం ఎదురుచూసీ లాభం లేదనుకుంటున్న ప్రజలు స్వచ్ఛంద సంస్థల సాయం కోరుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.రెండేండ్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని జీహెచ్ఎంసీ పార్కులోని కుంటలో మురుగు నీరు కలుస్తోందని, మురుగునీరు పార్కులోకి రాకుండా లైన్ వేయాలని అనేకసార్లు బల్దియా అధికారులకు మొరపెట్టినా.. లాభం లేకపోవడంతో సాయం అందించాలని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్‌ను కోరారు.
మురుగు సమస్యలను పరిశీలించిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్.. రోడ్ నెం 5లోని పార్కులోకి మురుగునీరు చేరకుండా పైప్‌లైన్ వేయడంతో పాటు కుంటను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.70లక్షల అంచనా వ్యయంతో మూడురోజుల కిందట పనులు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్ నం. 1మీదుగా పార్కులోకి చేరుతున్న వరదనీటితో పాటు మురుగునీటిని పార్కులోని కుంటలోకి చేరకుండా భారీ పైప్‌లైన్‌ను వేస్తున్నారు.
ఈ పనులు పూర్తయితే సుమారు రెండేండ్లుగా తాము ఎదుర్కొంటున్న మురుగు సమస్యలు తీరుతాయని, పార్కులో మురుగునీరు తొలగిపోయి వర్షపునీరు చేరితే దుర్గంధం తొలగిపోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీహెచ్ఎంసీ పార్కులోకి మురుగునీరు చేరకుండా బాక్స్ డ్రైయిన్ నిర్మించాలని సుమారు ఏడాదిన్నర కాలంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని, గతంలోనే సుమారు రూ.40లక్షల వ్యయంతో బాక్స్ డ్రెయిన్ కోసం టెండర్లు జారీ చేసినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని జీహెచ్ఎంసీ సర్కిల్-18 ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు. సీఎస్ఆర్ కింద రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సంస్థ ఈ పనులను చేపట్టేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. మురుగు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఊరట కలిగిస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.