సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుంటున్నా కనికరం చూపకుండా వ్యవహిస్తున్నది. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి అభివృద్ధి పేరిట చేసే మోసాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నది. పేదల భూములను లాక్కొని చేపట్టాలనకుంటున్న రేవంత్‌రెడ్డి కలల ప్రాజెక్టుకు చేపట్టే భూసేకరణను అధికారులు వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే మూసీ పరీవాహకంలోని హైదర్‌గూడ, కిస్మత్పూర్ ప్రజలను మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో విచారణకు పిలిచారు.
గతంలో ఆ ప్రాంత ప్రజలు తమ భూములను లాక్కోవద్దంటూ ఇచ్చిన వినతులపై విచారించేందుకు ఆహ్వానిస్తున్నట్లు నోటీసులు జారీ చేసి బాధితులకు వివరణ ఇచ్చేందుకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ అక్కడికి వెళ్లాక బాధితుల మాటలేవీ పట్టించుకోకుండా అధికారులు తమ పని తాము చేసుకుంటున్నట్లుగా వ్యవహరించినట్లు బాధితులు వాపోతున్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ నుంచి అభ్యంతరాలు స్వీకరించినట్లు రికార్డుల్లో నమోదు చేసుకోవడానికే పిలిచారని చెప్తున్నారు. మూసీని సుందరీకరించేందుకు బఫర్ జోన్‌కు దూరంగా ఉన్న తమ భూములను ఎందుకు లాక్కొంటారని ప్రశ్నించారు. హిమాయంత్ సాగర్ దిగువ భాగం నుంచి 500 మీటర్ల దాకా ఉన్న భూములన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయని ఆర్డీవో చెబుతున్నట్లు వాపోయారు.ఎలాంటి నిర్మాణాలు, పనులు, కట్టడాలు చేపట్టొద్దని కోరుతున్నారు.
ప్రాణాలు పోయినా..
సరోవర్ ప్రాజెక్టు పేరిట హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రజల భూములను తీసుకునేందుకు ఇండ్లు, భూములను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోబోమని కిస్మత్పూర్, హైదర్‌గూడ ప్రజలు తేల్చి చెప్తున్నారు. ప్రాణాలు పోయినా తమ భూములు, ఇండ్లను లాక్కోనీయమని స్పష్టం చేశారు. విచారణలు, నోటీసుల పేరిట మభ్యపెట్టి భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని.. పర్యాటకం అభివృద్ధి చేయాలంటే అక్కడ చేసుకోవాలని స్పష్టం చేశారు. తమ భూములు, ఇండ్లను లాక్కోవద్దని కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవోలకు ఇప్పటికే ఫిర్యాదులు చేశామని.. అవేమీ పట్టించుకోకుండా నోటీసులు, విచారణ పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇండ్లను కూల్చి, భూములను చెరబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నిర్మాణానికి అనుమతి ఎలా ఇచ్చారు
మేం నివాసముంటున్న స్థలం హిమాయత్ సాగర్ బండ్ ప్రాంతమని అధికారులు చెబుతున్నారు. బండ్ ప్రాంతంలో భూముల కొనుగోళ్లు అమ్మకాలకు ఎలా అనుతిచ్చారు? బండ్ ప్రాంతానికి పట్టాలు ఎలా ఇచ్చారు? ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఎందుకిచ్చారు? అనుమతులన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి కదా? ఇప్పుడు మా ఇండ్లు, స్థలాల్లో నిర్మాణాలు తొలగించి చెట్టు నాటుతామని అధికారులు చెబుతున్నారు. ఏం చెట్లు నాటాలో చెప్పండి మేమే నాటుతాం. మా ఇండ్లు మా స్థలాలను లాక్కోవాలని చూస్తే ఊరుకోం. ఎన్ని నోటీసులిచ్చినా వెనక్కి తగ్గం. ప్రభుత్వం పునరాలోచించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలి.
-సుభాని, కిస్మత్పూర్