డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
లబ్ధిదారుడికి వాహనం పంపిణీ
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ కల సాకారం చేయాలి
సికింద్రాబాద్, జూన్ 25: కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. శనివారం సీతాఫల్‌మండిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద బౌద్ధనగర్‌కు చెందిన దళితబంధు లబ్ధిదారుడు తుకారంకు షిఫ్ట్ డిజైర్(కారు) వాహనాన్ని డిప్యూటీ స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో ఇప్పటికే వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. మరో 1500 కుటుంబాలకు గాను రెండో విడతలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం ప్రయోజనాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారులు తమ ఇష్టమైన రంగంలో రాణించి దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు జీవితంలో స్థిరపడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్‌తోపాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అడ్డగుట్ట, జూన్ 25 : పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం అడ్డగుట్ట డివిజన్ పరిదిలోని ఆజాద్‌చంద్రశేఖర్ నగర్, సీ, డీ సెక్షన్, వడ్డెరబస్తీ, మాంగరోడి బస్తీ, తుకారాంగేట్, సాయినగర్, ఇంద్రానగర్ కాలనీ, వెంకట్‌నగర్ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటికి తిరుగుతూ రూ.26 లక్షలకు పైగా విలువ చేసే 27 కల్యాణలక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులను అందజేసే విధానాన్ని ఎనిమిదేండ్లుగా పాటిస్తున్నామని, ఇలా చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు.