Hyderabad | జూబ్లీహిల్స్, జూన్ 27 : రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, వైద్య అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. యూసుఫ్‌గూడా సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ సాల్మన్ రాజ్, శ్రీరామ్ నగర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ బి. విజయ నిర్మల ఆధ్వర్యంలో శానిటేషన్, మలేరియా, వైద్య బృందాలు డెంగీ పాజిటివ్ వచ్చిన మహిళ ఇంటికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఎంటమాలజీ ఏఈ సావిత్రి ఆధ్వర్యంలో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు.
దీంతో పాటు ఎల్లారెడ్డి గూడా అంబేద్కర్ నగర్లో కూడా జ్వరంతో బస్తీ దవాఖానకు వెళ్లిన 22 ఏండ్ల వ్యక్తికి డెంగీ పాజిటివ్ రావడంతో వైద్య బృందాలు అప్రమత్తమై సర్వే నిర్వహించడంతో పాటు ఎంటమాలజీ సిబ్బంది యాంటీ లార్వా ఆపరేషన్ చేశారు. జీహెచ్ఎంసీ, వైద్య బృందాలు పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు అవగాహన కల్పించారు.