శంషాబాద్ రూరల్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న సముదాయాలను శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ షర్మిల మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసిన సమయంలోనే హెచ్ఎండీఏ బ్రిడ్జి చుట్టూ ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కానీ కొందరు రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాలను ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్పై వచ్చిన వాహనాలతో పాటు, బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు ఎయిర్‌పోర్టుకు వెళ్లడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం అయితే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌జాం కావడంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఎయిర్‌పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి చుట్టూ ఉన్న భూములు పూర్తిగా హెచ్ఎండీఏకు చెందినవేనని అడిషనల్ కలెక్టర్ షర్మిల స్పష్టం చేశారు. అక్కడి చేరుకొని కూల్చివేతలు నిలిపివేయాలని అడ్డుతగిలే ప్రయత్నం చేసిన్నట్లు తెలిపారు. రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరడంతో కూల్చివేతలు నిలిపివేసినట్లు చెప్పారు. రెండ్రోజుల్లో వంతెన చుట్టూ ఉన్న భూమిలో ఉన్న నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, గతంలో భూమిని సేకరించిన సమయంలో మాకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదని స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘రెండు రోజులు సమయం ఇస్తున్నం. ఏదైనా ఉంటే అన్ని తొలగించాలని, లేదంటే.. పూర్తిగా హెచ్ఎండీఏ తొలగించడం ఖాయమని అధికారులు స్పష్టం చేశారు.