దుండిగల్ , ఫిబ్రవరి 11: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నిజాంపేటలోని సర్వే నం. 334 అసైన్డ్ భూముల్లో వెలసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మరోసారి మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. వారం రోజుల క్రితమే ఇక్కడ కొన్ని నిర్మాణాలను తొలగించిన అధికారులు, మంగళవారం ఉదయం మళ్లీ భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్తీకి చేరుకొని సుమారు ఆరు నిర్మాణాలతో పాటు కొన్ని షెడ్లు, మరికొన్ని బేస్మెంట్లను కూల్చి వేశారు.
దీంతో సదర్ ఇండ్లలో నివాసముంటున్న పేదలు బోరున విలపించారు. ఇండ్లలోని సామాను ఖాళీ చేయించు మరి కూల్చివేతలు చేపడుతూ ఉండటంతో స్థానికుల్లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తమైంది. తమకు కనీసం చెప్పకుండానే ఏకధాటిగా కూల్చివేతలు చేపట్టడం తమ బతుకులు ఏం కావాలని మహిళలు విలపించారు. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్న తమను ఇలా ఇబ్బందుల పాలు చేయడం తగదన్నారు.
అయితే, కొద్దిగా గడువు ఇయ్యాలని, ప్రభుత్వ పెద్దలతో తాము మాట్లాడతామని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వో విజ్ఞప్తి చేయడంతో కొద్దిసేపు కొంచెం నిలిపివేశారు. వాస్తవానికి సర్వే నంబర్ 334 లో ఇటీవల నిర్మించిన వివాదాస్పద నిర్మాణానికి సంబంధించి కూల్చివేతకు వచ్చిన అధికారులు దానిని స్థానికులు అడ్డుకోవడంతో వెనకే ఉన్న పలు ఇళ్లను తొలగించారు. జనాలను ఇండ్లలోంచి బయటికి రప్పించి, సామాను బయట పెట్టించి కూల్చివేతలు చేపట్టడం పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఇటీవల ఏర్పాటు చేసిన కార్పొరేట్ వైద్యశాల నిర్వాహకులు రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ర్యాంపును ఏర్పాటు చేసుకోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. పైపులైన్ రోడ్డు మార్గంలో ఎన్ హెచ్ 44 ప్రధాన రహదారికి జీడిమెట్ల ఇండస్టియ్రల్ కు అనుసంధానంగా ఉన్న ఈ మార్గంలో ఇటీవల మేడ్ వన్ ప్రైవేట్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసుకుని దానికి ముందు రహదారి రోడ్డును ఆక్రమించి ర్యాంపును నిర్మించారు. రాకపోకలకు తీవ్ర ఆటంకాలు రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తమ సిబ్బందితో ర్యాంపును కూల్చివేసి రోడ్డును విస్తరించారు. దీంతో ట్రాఫిక్ సమస్యకు అంతరాయం తొలగిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.