Operation River Bed | ఎలాగైనా ఆపరేషన్ రివర్ బెడ్‌ను విజయవంతం చేయాలనే ప్రయత్నంలో అధికారులు..విడదీసి..తరలించు..సూత్రాన్ని అనుసరిస్తున్నారు. ఓ వైపు మూసీ నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నా.. తమ పని తాము చేసేస్తున్నారు. నిర్వాసితులను విడదీసి.. ఇండ్లు ఖాళీ చేయించే ప్రక్రియను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రోజుకు కొందరి చొప్పున తహసీల్దార్ల బృందం రంగంలోకి దిగుతున్నది. మొన్న హిమాయత్‌నగర్‌లోని శంకర్‌నగర్, మూసానగర్ 150 ఇండ్లను నేలమట్టం చేశారు. ఇప్పుడు మరో 70 గృహాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం అధికారులు సైదాబాద్ నిర్వాసితుల ఇండ్ల పట్టాలు ముందే సిద్ధం చేసి.. వాటిని వారికి చూపించి ఖాళీ చేయాలని మంతనాలు జరిపారు. ఇలా ఒక క్రమ పద్ధతిలో విడదీసి ఇండ్లును కూల్చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 30 కుటుంబాలను తరలించినట్టు సమాచారం. అయితే డబుల్ బెడ్రూంలు కేటాయిస్తామంటూ అధికారులు తమను బలవంతంగా తరలిస్తున్నారంటూ నిర్వాసితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా.. హైదరాబాద్ మూసీ నిర్వాసితుల బతుకులు మాత్రం ఆగమవుతున్నాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)
ఆపరేషన్ రివర్ బెడ్ క్షణక్షణం ఉత్కంఠగా సాగుతున్నది. ఓ వైపు నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నా… కదిలేదే లేదంటూ సమర శంఖం పూరిస్తున్నా.. అధికారులు మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్వాసితులను విడదీసి.. ఇండ్ల పట్టాలను సిద్ధం చేసి.. వారికి చూపించి..ఇండ్లు ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తున్నారు. హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతంలో మొత్తం రివర్ బెడ్లో 1595 నిర్మాణాలను అధికారులు గుర్తిస్తే.. అందులో 945 ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. రివర్ బెడ్ అత్యధిక నిర్మాణాలు నాంపల్లిలో 604 ఉండగా, బహదూర్‌పురాలో 527 ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కూల్చేసిన ఇండ్ల వారికి డబుల్ బెడ్రూంలు అందించామని చెబుతుండగా, కొందరు మాత్రం ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. మరికొందరు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన దుస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కూల్చడమే ఎజెండా
నిర్వాసితులు నిరసనలు తెలుపుతున్నా.. అధికారులు మాత్రం ఇండ్లు కూల్చడమే ఎజెండా పెట్టుకున్నారు. ఒక వేళ జేసీబీలు ప్రవేశిస్తే.. రణరంగంగా మారే పరిస్థితులున్నాయి. ఇదిలా ఉంటే రెడ్ మార్క్ వేసిన నిర్మాణాలను కూల్చివేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది. అయితే నిర్వాసితులను ఒప్పించే ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.
కొందరు ముందుకొచ్చినా డబుల్ బెడ్రూంల్లోకి వెళ్లాక అక్కడి పరిస్థితులు చూసి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆపరేషన్ రివర్ బెడ్ పూర్తవ్వడం తలకు మించిన భారంగా కనిపిస్తున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించినప్పటికీ ఎలాగైనా ఖాళీ చేయించి.. కూల్చాల్సిందేనని ఆదేశాలు వస్తుండటంతో అధికారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వాసితుకులకు ఫోన్లు చేయడం, నేరుగా కలిసి మాట్లాడటం, కౌన్సెలింగ్ చేయడం వంటివి చేస్తున్నారు.
మొత్తం 7,850 నిర్మాణాలు
మూసీ బఫర్ జోన్ పరిధిలో డ్రోన్ సర్వే ప్రకారం మొత్తం 7,850 నిర్మాణాలు ఉన్నట్టు హైదరాబాద్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందులో హైదరాబాద్‌లో 5,250, రంగారెడ్డి, మేడ్చల్‌లో 2,600 వరకు నిర్మాణాలు ఉన్నట్టు తెలిపారు. వేలాది మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని చెబుతున్నారు. సరైన నిర్ధారణ లేకుండా లెక్కలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రివర్ బెడ్ కూల్చివేతలే గగనంగా మారడంతో బఫర్ జోన్ జోలికొస్తే నిర్వాసితులను ఎదుర్కోవడం కష్టమంటున్నారు.