మూసీ నది అభివృద్ధి పేరిట ఇండ్లను కూలుస్తామంటే ప్రాణాలు పోయినా ఇంటి స్థలాలను ఇవ్వబోమని పరీవాహక ప్రాంత ప్రజలు తేల్చి చెప్పారు. గాంధీ సరోవర్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. గాంధీ సరోవర్ కావాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలంటూ.. తమ ఇంటి స్థలాలను ఇష్టానుసారం లాక్కొంటామంటే ఎలా అని నిలదీశారు. గాంధీ సరోవర్, మూసీ రివర్ ఫ్రంట్ పేరిట తమ ఇంటి స్థలాలను లాక్కొని తమను రోడ్డున పడేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
‘ప్రభుత్వ భూములను వందల కోట్లకు విక్రయిస్తూ మా భూములను మాత్రం నామమాత్రపు ధరలకు తీసుకుంటామంటే సహించబోం. మా భూములను కూడా అదే తరహాలో కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇండ్లను కోల్పోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. భూసేకరణ నోటిఫికేషన్లో తమ సర్వే నంబర్లను చూసినప్పుడే ప్రాణాలు పోయినంత పనైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా గ్రామసభలు పెట్టి అధికారులు వారికి అనుకూలంగా తీర్మానాలు చేసుకొని.. తమ స్థలాలను లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూసేకరణ నోటీసులు ఇచ్చిన వెంటనే గ్రామసభలు పెట్టడమేంటని నిలదీశారు. -సిటీబ్యూరో, బండ్లగూడ, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)
మూసీ పునరుజ్జీవం పేరిట హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, బుద్వేల్, కిస్మత్పూర్, బండ్లగూడ, హైదర్షాకోట్, మధుపార్క్ తదితర ప్రాంతాల నుంచి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సంబంధిత భూముల సర్వే నంబర్లతో నోటిఫికేషన్ జారీ చేసింది. గాంధీ సరోవర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఎకో ప్రాజెక్ట్ అభివృద్ధి పేరిట భూ సేకరణ కోసం గ్రామ రెవెన్యూ అధికారులు గురువారం హైదర్‌గూడ, కిస్మత్పూర్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభలకు ఇంటి స్థలాల యజమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ పేరిట పట్టా భూములను లాక్కొని తమకు అన్యాయం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. టూరిజం, అభివృద్ధి అని చెప్పుకొంటూ.. తమ భూములను లాక్కొంటూ జీవితాలను ఆగం చేస్తున్నారని గ్రామ సభల్లో ముక్తకంఠంగా నినదించారు. అభివృద్ధి పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రెండేండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తప్పనిసరి అనుకుంటే తమ భూములకు ప్రత్యామ్నాయంగా సమానమైన భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. లక్షల్లో లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుని ఈఎంఐలు కడుతున్నామని వాపోయారు. ఇప్పటికిప్పుడు ఇండ్లను కూలుస్తామంటే ఏండ్ల తరబడిగా ఈఎంఐలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు.
హిమయత్సాగర్ ప్రాంతంలో మేము సర్వే నంబర్ 119లో 20 ఏండ్ల కింద స్థలం కొనుగోలు చేశాం. ఆ స్థలం ఉన్న సర్వే నంబర్లను భూ సేకరణ నోటిఫికేషన్లో ఇచ్చారు. కాయ కష్టం చేసి సంపాదించుకున్న భూమిని ప్రభుత్వం అకారణంగా లాక్కొంటే మాకు చావొక్కటే దిక్కు. కాంగ్రెస్ ప్రభుత్వం మా స్థలానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర ప్రకారం మరో ప్రాంతంలో స్థలం ఇవ్వాలి. లేదంటే మా స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇవ్వబోం. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే గ్రామ సభల పేరిట హడావుడి చేస్తున్నారు. మా భూములను లాక్కొనేందుకే ఇదంతా చేస్తున్నారు.
– సాయి కుమార్, మూసీ పరీవాహక వాసి
మరో వారంలో పరీక్షలున్నాయి. ఇప్పుడు అధికారులు వచ్చి మమ్మల్ని ఇండ్లు ఖాళీ చేయాలని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ‘మేం చూసుకుంటాం.. నువ్ శ్రద్ధగా చదువుకో అని మానాన్న చెబుతున్నా.. ఇల్లు కూలుస్తార’నే ఆందోళన కలుగుతున్నది. మా అమ్మ బంగారం తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు మా ఇల్లు కూల్చి గాంధీ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏముంది? గాంధీ అంటే అందరికీ గౌరవం ఉంటుంది. కానీ ఇండ్లు కూల్చి కడతామంటే గాంధీ కూడా ఒప్పుకోరు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ విగ్రహాలు కడతమనడం సరికాదు కదా? ప్రభుత్వం కొంచం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
– ఇంటర్ విద్యార్థి
మూసీ అభివృద్ధికి ఇప్పటి దాకా అసలు ప్రణాళికలే సిద్ధం చేసుకోలేదు. అప్పుడే భూములను తీసుకుని ఏం చేస్తారు?.. అది కూడా మూడు ప్రాంతాల్లో భూముల సేకరణ కోసం మూడు రకాల నోటిఫికేషన్లు ఎలా ఇస్తారు? హైదర్‌గూడలో ఎఫ్టీఎల్కు సంబంధించిన భూములకు ఒక రేటు, బఫర్ జోన్లకు సంబంధించిన భూములకు ఒక రేటు.. రూరల్ ప్రాంతాలకు మరో రేటు అని చెబుతున్నారు. టీడీఆర్లని వేల గజాల భూమిని తీసుకొని వందల గజాల్లో ఎలా ఇస్తారు? ఎఫ్టీఎల్లు చెరువులకు ఉంటా యి.. కానీ నదులకు ఉండవు. దీని ప్రాతిపాదికన మీరు ఇచ్చిన నోటీసులే తప్పు అని స్పష్టం అవుతున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి బఫర్ జోన్లు కూడా నిర్ధారించలేదు. మూసీ పరీవాహక ప్రజలకు న్యాయం చేయకుంటే కోర్టులో తెల్చుకుంటాం.
-కార్తిక్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత
సాయినగర్‌లో మాకు నాలుగు వందల గజాల స్థలం ఉంది. ఇప్పుడు ఆ స్థలం మూసీ అభివృద్ధి పేరిట తీసుకుంటాం అంటున్నారు. గ్రామ సభకు రావాలని కిస్మత్‌పూర్‌కు పిలిచారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమి అది. మా భూమికి బదులు అంతే విలువైన భూమిని ఇస్తేనే మేం ప్రభుత్వానికి సహకరిస్తాం. అంతేకానీ మాభూమి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోం. అధికారులకు కూడా అదే చెబుతున్నాం. అక్రమంగా మా భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోం.
-మమత, మూసీ పరీవాహక బాధితురాలు