Secunderabad | సికింద్రాబాద్, మే 29 : సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి నేతలు గురువారం లేఖ రాశారు. అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్, కమిటీ సభ్యులు ఈ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిజిస్టర్ పోస్టులో పంపారు.
1959 వరకు ప్రత్యేక కార్పొరేషన్‌గా కొనసాగిన సికింద్రాబాద్‌ను 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలో వసూలైన నిధులు మరొక ప్రాంతానికి తరలి పోవడం ప్రారంభమైంది అని చెప్పారు. అనంతరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా విస్తరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిన కూడా కేవలం అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు తరలి వెళుతున్న విషయం సికింద్రాబాద్ ప్రజలను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుందన్నారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాను రాను సికింద్రాబాద్ మరొక పాత నగరంగా మిగిలి పోతుందనే ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో నెలకొందన్నారు. రోడ్ల విస్తరణ, నూతన ఫ్లైఓవర్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచకపోవడం, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం మమ్మలి నిర్లక్ష్యం చేస్తుందనే ఆందోళన సికింద్రాబాద్ ప్రజల్లో ఉంది. 2006లో సికింద్రాబాద్‌కు 200 ఏండ్లు నిండిన సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన రూ. 200 కోట్ల నిధుల విడుదల కూడా రాజశేఖరరెడ్డి మరణంతో మరుగున పడింది అని గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్న అవి సికింద్రాబాద్ ప్రజలకు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయడం, శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపడం లాంటి చర్యలు సికింద్రాబాద్ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేయడం జరిగిందన్నారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా కల్పించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి సికింద్రాబాద్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు లేఖలో కోరారు.