కవాడిగూడ, జూలై 12: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని వండే వంట కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల మిడ్ డే మీల్స్ కుకింగ్ వర్కర్స్ యూనియన్ ఏజెన్సీల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాంబాబుయాదవ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు అక్షయపాత్రకు పథకాన్ని అప్పగించి తాము బాగుపడేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రసిడెంట్ బి.మంజుల తదితరులు పాల్గొన్నారు.